భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ నిలిపేసిన మలేషియా.. 2027 జనవరి 1 నుంచి కొత్త రూల్స్!

భారతీయులకు వీసా-ఫ్రీ ఎంట్రీ నిలిపేసిన మలేషియా.. 2027 జనవరి 1 నుంచి కొత్త రూల్స్!

మలేషియా వెళ్లాలనుకునే భారతీయ టూరిస్టులకు షాకింగ్ న్యూస్. 2026 డిసెంబర్ 31తో వీసా-ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2027 జనవరి 1 నుంచి మలేషియాలోకి ప్రవేశించే భారతీయులు తప్పనిసరిగా ముందుగానే వీసా పొందాల్సి ఉంటుందని ప్రకటించింది.   

ఇందుకోసం 2026 డిసెంబర్ 1 నుంచి అధికారిక మైవీసా పోర్టల్ ద్వారా వీసా దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని కల్పించారు. జనవరి 1, 2027 తర్వాత ప్రయాణించేవారు బయలుదేరడానికి ముందే వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయం వెనుక గట్టి కారణమే ఉంది. కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ 2 నెలల క్రితం జారీ చేసిన అడ్వైజరీ తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. 30 రోజుల వీసా-ఫ్రీ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సెప్టెంబర్‌లోనే హైకమిషన్ హెచ్చరించింది.   

నకిలీ ఉద్యోగ హామీలతో నకిలీ ఏజెంట్ల బారిన పడి కొందరు భారతీయులు అక్రమంగా నివసించడం, ఓవర్‌స్టే, దోపిడీ, నిర్బంధం, చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారని హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం, సామాజిక సందర్శనలకే పరిమితమైన వీసా-ఫ్రీ సదుపాయాన్ని జాబ్స్ కోసం వాడుకోవడం ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేసింది.   

వర్క్ పర్మిట్, రిఫరెన్స్‌తో కూడిన వీసా లేకుండా జాబ్స్ కోసం మలేషియాకు వెళ్లవద్దని మరోసారి ఖరాఖండీగా హెచ్చరించింది. ఇకపై టూర్ ప్లాన్ చేసుకునే భారతీయులు మైవీసా పోర్టల్ ద్వారా ముందుగానే వీసా తీసుకుని ప్రయాణాలకు సిద్ధం కావాలని గుర్తుంచుకోండి.