బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు రావడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు టార్గెట్ చేసుకున్న దుండగులు.. లేటెస్ట్ గా స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు హత్య బెదిరింపులు వచ్చాయి . ఈ నేపథ్యంలో బాబా సిద్ధిఖీ హత్యకేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న జీషాన్ అక్తర్ పేరు తెరపైకి రావడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిజంగానే జీషాన్ అక్తర్ ఈ బెదిరింపులకు పాల్పడ్డాడా? లేక అతడి పేరును ఉపయోగించుకుని మరెవరైనా సైఫ్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెదిరింపుల వెనుక అసలు వ్యక్తులు ఎవరన్నది తేల్చే పనిలో ఉన్నారు.
ఇటీవల నటులు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ కేసుల్లో బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల వైభవ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఎలాంటి క్రిమినల్ గ్యాంగ్‌లతో సంబంధాలు లేవని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెదిరింపు సందేశాలు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. 2025 జనవరి 16న సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి ఘటనను ఫ్యాన్స్ మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. బాంద్రాలోని తన నివాసంలోకి చొరబడిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. తన కుమారుడు జేహ్‌ను రక్షించే క్రమంలో ఆయనపై పలుమార్లు కత్తితో దాడి జరిగింది. వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు.
ఆ సమయంలో కుటుంబం ఎదుర్కొన్న భయానక పరిస్థితులను బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా గతంలో గుర్తుచేసుకున్నారు. సైఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రాత్రి దుస్తులతోనే రోడ్డుపైకి వచ్చి వాహనాల కోసం ప్రయత్నించానని వెల్లడించారు. ఇప్పుడు మరోసారి బెదిరింపుల వార్తలు రావడంతో సైఫ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది...
