న్యూఢిల్లీ: BS-6 వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC) వ్యాలిడిటీ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం (నవంబర్ 19) కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) నిబంధనలు, 2026 కింద అమల్లోకి వచ్చిన ఈ మార్పులు వాహనాల ఉద్గార ప్రమాణాలు, వయస్సు, వినియోగం (ప్రైవేట్/కమర్షియల్) ఆధారంగా వర్తిస్తాయి.
సవరించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఆరేళ్లలోపు ఉన్న BS-VI వ్యక్తిగత వాహనాలకు సర్టిఫికెట్ గడువు ఏడాది నుంచి మూడేళ్లుగా పొడిగించింది. కమర్షియల్ వాహనాలకు రెండేళ్ల రెన్యూవల్ గడువు ఇచ్చింది. ఇక, 6 నుంచి 10 ఏళ్ల లోపు వాహనాలకు ఏడాది వ్యాలిడిటీ.. ఆపైబడిన వాహనాలకు ఆరు నెలలుగా పేర్కొంది. కాగా, BS-1, 2, 3 వాహనాలకు మూడు నెలలు, BS-4 వాహనాలకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుంది. తాజా సవరణల్లో కొత్త BS-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలు ఎక్కువ కాలం పాటు రెన్యూవల్ అనుమతి పొందుతుండగా.. పాత వాహనాల రెన్యూవల్ వ్యాలిడిటీ తగ్గింది.
వెహికల్ మొదటి రిజిస్ట్రేషన్ తేదీఆధారంగా వాహన వయస్సును లెక్కిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే జారీ చేసిన PUC సర్టిఫికేట్ల విషయంలో వాటి తదుపరి రెన్యూవల్ సమయంలోనే ఈ కొత్త వ్యాలిడిటీ కాలపరిమితులు వర్తిస్తాయి. పాత సర్టిఫికేట్ గడువు ముగియడానికి 10 రోజుల ముందు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, పాత సర్టిఫికేట్ గడువు ముగిసిన తేదీ నుండే కొత్త వ్యాలిడిటీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకుంటే.. రెన్యువల్ చేసిన తేదీ నుంచే కాలపరిమితి లెక్కించబడుతుంది.
