వివాహితను వేధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీపై కేసు

వివాహితను వేధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీపై కేసు

వివాహితను వేధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ సీకా సాయికుమార్  గౌడ్ పై కేసు నమోదైంది.  సీకా సాయికుమార్  గౌడ్ వేధింపులపై   బాధితురాలి  భర్త ఫిర్యాదుతో అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ లో నవంబర్ 16న  కేసు నమోదు చేశారు పోలీసులు.

 సీకా  సాయికుమార్  కత్తితో దాడికి ప్రయత్నించడమే కాకుండా, కుటుంబ సభ్యులను గొడ్డలితో చంపుతానని బెదిరించినట్లు బాధితురాలి భర్త శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భార్య వద్ద ఉన్న సమయంలోనూ తనపై దాడి చేశాడని బాధితుడు ఆరోపించాడు.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన గుంటోజు శ్రీధర్‌కు 17 ఏళ్ల క్రితం జయశ్రీతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఏడాది క్రితం జయశ్రీకి అదే ప్రాంతానికి చెందిన సీకా సాయికుమార్ గౌడ్‌తో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారని శ్రీధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విషయం రెండు నెలల క్రితం తనకు తెలియడంతో భార్యను నిలదీశానని, ఆమె కూడా పరిచయం గురించి అంగీకరించిందని తెలిపారు. అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 10న అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో పెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలో ఇకపై ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేయబోమని సాయికుమార్, జయశ్రీ అంగీకరించినట్లు ఫిర్యాదులో  తెలిపారు. 

అయితే సమావేశం ముగిసే సమయంలో సాయికుమార్ కత్తితో తనపై దాడికి ప్రయత్నించాడని, తన బంధువులపై కర్రలతో దాడి చేశాడని శ్రీధర్ ఆరోపించారు. ఈ ఘటన తర్వాత అక్టోబర్ 13న తన బంధువు నాగార్జున రాజుకు ఫోన్ చేసి, కారులో గొడ్డలి ఉందని, ఈసారి శ్రీధర్‌తో పాటు అతడి సోదరుడు, మరో బంధువును తప్పకుండా చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.

ఇదిలా ఉండగా, జయశ్రీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను షామీర్‌పేట మండలం తూంకుంటలోని మనసా ఆసుపత్రిలో చేర్పించినట్లు శ్రీధర్‌కు అత్తమామలు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సాయికుమార్, జయశ్రీ తనకు కావాలని, ఆమెను వదిలిపెట్టనని అత్తమామలను కూడా బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.

ఈ క్రమంలో నవంబర్ 15న ఆసుపత్రిలో భార్య వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో సాయికుమార్ మరో గుర్తుతెలియని వ్యక్తితో కలిసి అక్కడికి వచ్చాడని, అతడిని ప్రశ్నించడంతో తన చొక్కా కాలర్ పట్టుకుని చేతులతో, కర్రలతో దాడి చేశాడని శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో తనకు అంతర్గత గాయాలయ్యాయని తెలిపాడు..

తనపై దాడి చేయడంతో పాటు కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీధర్ పోలీసులను కోరారు. ఈ మేరకు నవంబర్ 16న రాత్రి 9.45 గంటలకు అందిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.