మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ పట్ల మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అనుసరిస్తున్న వైఖరిని
మంచిర్యాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం (నవంబర్ 19) చెన్నూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ వంశీ కృష్ణ అధికారిక, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఒక దళిత ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుని, పార్లమెంట్ పరిధిలో పర్యటించకుండా ఆటంకాలు సృష్టించడం హేయమైన చర్య అని విమర్శించారు. సొంత పార్టీ ఎంపీని గౌరవించకపోవడంపై మండిపడుతూ, ఈ వ్యవహారాన్ని త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు తన వైఖరిని మార్చుకోకపోతే ఎస్సీ సామాజిక వర్గం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
