యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'వృషకర్మ' (Vrushakarma). మిస్టికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ చేశారు చిత్రబృందం. లేటెస్ట్ గాఈ సినిమా నుంచి ఎమోషనల్ అండ్ మోటివేషనల్ మెలోడీ సాంగ్'చలో పదావే' ను రిలీజ్ చేశారు మేకర్స్..
ఈ 'చలో పదావే' గీతం ఒక భావోద్వేగపూరితమైన ట్రాక్‌గా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాటలో నాగచైతన్య, బాలనటి కియారా ఖన్నా మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రధానంగా ఆవిష్కరించారు. సినిమాలో కియారా ఖన్నా ఆటిజం (Autism) ఉన్న చిన్నారి పాత్రలో నటిస్తోంది. ఆమెకు, చైతన్యకు మధ్య సాగే ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చారు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం జీవితం యొక్క విలువను వివరించేలా సాగుతుంది. ప్రముఖ గాయకుడు సాయి విగ్నేష్ ఈ పాటను ఆలపించారు. ఈ మెలోడీ సాంగ్ కథా గమనంలో కీలక పాత్ర పోషిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
'విరూపాక్ష' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విరూపాక్ష తరహాలోనే ఈ సినిమా కూడా మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగనుంది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. అలాగే 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ, సీనియర్ నటుడు జయరామ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సినిమాను 2026, డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాగచైతన్య కెరీర్లో ఇది ఒక భిన్నమైన ప్రయత్నమని, కథాంశం కొత్తగా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.
