జ్యోతిష్యం : మీ పిల్లలకు పెళ్లి కావడం లేదా? ఒక్క తులసి కళ్యాణం చాలు.. 3 నెలల్లో శుభవార్తే!

జ్యోతిష్యం : మీ పిల్లలకు పెళ్లి కావడం లేదా? ఒక్క తులసి కళ్యాణం చాలు.. 3 నెలల్లో శుభవార్తే!

పిల్లలకు పెళ్లి వయసు వచ్చినా సంబంధం కుదరకపోవడం తల్లిదండ్రులకు పెద్ద బాధ. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో వెనక్కి పోవడం, చూసిన వాళ్లు నచ్చకపోవడం, నచ్చిన వాళ్లు వద్దనడం.. ఇలా ఏళ్లు గడిచిపోతుంటే ఇంట్లో టెన్షన్ పెరిగిపోతుంది. అలా టెన్షన్​పడే తల్లిదండ్రులు కార్తీక శుక్ల పక్షంలోని ద్వాదశి తిథి తులసీ కళ్యాణం చేస్తే ఓ మూడు నెలల్లో ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది.. ఎలా కళ్యాణం చేయాలి.. పూజా విధానం ఏమిటి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

పెళ్లి సంబంధం కుదిరేందుకు ఆటంకాలు వస్తుంటే మన పెద్దలు చెప్పే అద్భుత పరిష్కారమే తులసి కళ్యాణం. కార్తీక మాసంలో ఒక్కసారి భక్తితో ఈ కళ్యాణం జరిపిస్తే చాలు, 3 నెలల్లోనే ఇంట్లో శుభవార్త వినిపిస్తుందని పండితులు గట్టిగా చెబుతున్నారు. పెళ్లి కావలసిన పిల్లల తల్లి దండ్రులు వారి పేరున జరిపించాలని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

తులసి కళ్యాణం ఎప్పుడు చేయాలి

హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ద్వాదశి రోజున తులసి వివాహాన్ని నిర్వహిస్తారు. ఈఏడాది( 2026)  నవంబర్ 21, శనివారం ఈ పర్వదినం వచ్చింది. ఈ సందర్భంగా తులసి దేవిని లక్ష్మీ స్వరూపంగా భావించి, శాలిగ్రామ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుతో వివాహం నవంబర్​ 21 వ తేది  జరిపిస్తారు

  • కార్తీకమాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి ప్రారంభం:  నవంబర్ 21 ఉదయం 6:31 గంటలకు
  • కార్తీకమాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి ముగింపు : నవంబర్ 22 ఉదయం 4:56 గంటలవరకు  
  • ప్రదోషకాల పూజా సమయం: నవంబర్​ 21  సాయంత్రం 5:25 నుంచి 7:49 గంటల వరకు 

కార్తీక మాసంలో తులసి ఆరాధనకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో నిర్వహించే తులసి వివాహం అత్యంత విశిష్టమైన పర్వదినంగా గుర్తింపు పొందింది. తులసి దేవిని శ్రీమహావిష్ణువు శాలిగ్రామ రూపంతో వివాహం చేసే ఈ వేడుకను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వివాహం జరిపించడం వల్ల పెళ్లికాని పిల్లలకు వెంటనే మంచి సంబంధం కుదురుతుందని..  దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని, కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు

 పెళ్లి ఆలస్యానికి ప్రధాన కారణాలు 

కుజదోషం: జాతకంలో కుజుడు అనుకూలంగా లేకపోతే సంబంధాలు మాట వరకు వచ్చి ఆగిపోతాయి.

కాలసర్ప దోషం: దీని వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ముందుకు సాగదు.

 శుక్ర దోషం: పెళ్లి విషయంలో శుక్రుడి అనుగ్రహం చాలా ముఖ్యం. శుక్రుడు బలహీనంగా ఉంటే పెళ్లి ఆలస్యం అవుతుంది.ఈ దోషాలన్నింటికీ విరుగుడులా పనిచేసేదే తులసి కళ్యాణం

తులసి కళ్యాణం అంటే ఏంటి?

తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శాలిగ్రామ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు తులసికి వివాహం జరిపించడమే తులసి కళ్యాణం.ఒక కన్యాదానం చేసినంత పుణ్యం ఈ కళ్యాణం చేస్తే వస్తుందని శాస్త్రం చెబుతోంది. అందుకే పెళ్లికాని పిల్లల ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద ఈ కళ్యాణాన్ని సంకల్పంతో చేయాలని పండితులు చెబుతున్నారు. 

తులసి కళ్యాణం ఎలా చేయాలి?

కార్తీక శుద్ధ ద్వాదశి ( 2026 నవంబర్​ 21)  రోజున ఈ కళ్యాణం చేయడం అత్యంత శ్రేష్ఠం. ఆ రోజు కుదరకపోతే కార్తీక మాసంలో ఏ గురువారం, శుక్రవారం అయినా చేయవచ్చు.

చేయాల్సిన విధానం ఇదే:

 అలంకరణ: తులసి మొక్క ఉన్న కుండీని పసుపు, కుంకుమ, పూలతో పెళ్లికూతురిలా అలంకరించాలి. పక్కనే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని లేదా శాలిగ్రామాన్ని పెళ్లికొడుకులా ముస్తాబు చేయాలి.

 సంకల్పం: పూజ మొదలు పెట్టే ముందు "నా కుమార్తె / కుమారుడికి త్వరగా మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలి" అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఇదే అత్యంత ముఖ్యమైన ఘట్టం.

 కళ్యాణ ఘట్టం: పురోహితుడి సమక్షంలో జీలకర్ర బెల్లం పెట్టడం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు పోయడం వంటి పెళ్లి తంతు అంతా యథావిధిగా జరిపించాలి.

నైవేద్యం:  పరమాన్నం, పులిహోర, వడపప్పు, పానకం, బెల్లం ముక్క, పండ్లు

 ప్రదక్షిణ: కళ్యాణం అయ్యాక తులసి చుట్టూ దంపతులు లేదా తల్లిదండ్రులు ప్రదక్షిణ చేసి హారతి ఇవ్వాలి.

దీపధూపాలు వెలిగించి విష్ణుమంత్రాలు, తులసి స్తోత్రాలు పఠించాలి. అనంతరం వివాహ సంప్రదాయంలో భాగంగా తులసి, శాలిగ్రామాల చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. శాలిగ్రామానికి బియ్యం సమర్పించకుండా నువ్వులు లేదా తెల్ల చందనాన్ని ఉపయోగించడం సంప్రదాయంగా పాటిస్తారు.

3 నెలల్లో శుభవార్త ఎలా వస్తుంది?

తులసి కళ్యాణం చేసిన వెంటనే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని నమ్మకం. తులసమ్మ అనుగ్రహంతో పిల్లల జాతకంలో ఉన్న వివాహ ఆటంకాలు తొలగిపోయి, మంచి సంబంధాలు రావడం మొదలవుతాయి.చాలా మంది ఈ కళ్యాణం చేసిన రెండు, మూడు నెలల్లోనే పెళ్లి నిశ్చయమైందని చెబుతున్నారు. అందుకే ఈసారి కార్తీకంలో ఈ అవకాశాన్ని వదులుకోకండి.

ఈ 3 తప్పులు చేయకండి

  • తులసి కళ్యాణం చేసే రోజున ఇంట్లో మాంసాహారం, మద్యం అస్సలు ఉండకూడదు.
  • తులసి మొక్కను ఎండిపోయిన దాన్ని, విరిగిపోయిన కుండీలో ఉన్న దాన్ని పెట్టి కళ్యాణం చేయకూడదు.
  • కళ్యాణం చేసిన తర్వాత తులసిని నిర్లక్ష్యం చేయకూడదు. 
  • ప్రతిరోజూ నీళ్లు పోసి దీపం పెట్టాలి.

తులసి వివాహం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవం ఉండాలనే సందేశాన్ని కూడా ఈ వేడుక గుర్తుచేస్తుంది. తులసి దేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీమహావిష్ణువుతో ఆమె వివాహం జరిపించడం ద్వారా ఇంట్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వివాహాన్ని నిర్వహించడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. పెళ్లైన దంపతులు తమ వైవాహిక జీవితంలో సుఖశాంతులు ఉండాలని ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. వివాహం కాని యువతీ.. యువకులకు  మంచి జీవిత భాగస్వామి లభించాలని తులసి దేవిని ఆరాధిస్తూ.. వారి తల్లిదండ్రులు తులసీకళ్యాణం జరిపిస్తారు.

మీ పిల్లల పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఆలస్యం చేయకుండా ఈ కార్తీకంలో ఒక్కసారి తులసి కళ్యాణం జరిపించి చూడండి. తులసమ్మ దయతో మీ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.