సిద్దిపేట: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలు, కార్మికులు, విద్యార్థులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, సాధించిన ప్రగతిని వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. గత పదేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల కొత్త చేయూత పెన్షన్లు అందించామని పేర్కొన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులకు పెన్షన్లు అందించిన సమయంలో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8:30 గంటలకు సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో రూ.13 వేల కోట్ల వ్యయంతో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేశామని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం సవరించని కనీస వేతనాలను తమ ప్రభుత్వం సవరించిందని తెలిపారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో రూ.4,500 కోట్ల వ్యయంతో అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం ప్రకటించాలి
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారాన్ని ఈసారైనా ప్రకటించి వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. అదేవిధంగా సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
