తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ కుటుంబమే..అసెంబ్లీకి వస్తే మీ బండారం బయటపెడ్తా: సీఎం రేవంత్

తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ కుటుంబమే..అసెంబ్లీకి వస్తే మీ బండారం బయటపెడ్తా: సీఎం రేవంత్

కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి 512 టీఎంసీల నీటిని ఏపీకి ఇచ్చింది కేసీఆర్, హరీశ్ రావు కాదా? అని ప్రశ్నించారు. వారిద్దరూ సంతకాలు చేసిన కాపీలన్నీ తన దగ్గర ఉన్నాయని అన్నారు.అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని వ్యవహారాలను బయటపెడతానని హెచ్చరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పారని విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. కరీంనగర్‌ను వదిలి పాలమూరుకు వచ్చిన కేసీఆర్‌ను అక్కడి ప్రజలు ఆదరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ వస్తే కృష్ణా జలాలు తమ ప్రాంతానికి వస్తాయని ఆశించి పాలమూరు ప్రజలు ఆయనను గెలిపించారని అన్నారు. కేసీఆర్ రక్తంలో నిజాయితీ ఉంటే పాలమూరు ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవని వ్యాఖ్యానించారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని, అప్పట్లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నారని ప్రస్తావించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టు కూలిపోయిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గతంలో హరీశ్ రావు ఉద్యమాలు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే కాలేజీలకు పాలు సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.