కేసీఆర్ రక్తంలోనే నమ్మినవారిని మోసం చేసే గుణం: సీఎం రేవంత్

కేసీఆర్ రక్తంలోనే నమ్మినవారిని మోసం చేసే గుణం: సీఎం రేవంత్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గురువారం (నవంబర్ 19) సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే, రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు సింగిల్‌ విండో ఎన్నికల్లో మొదటిసారి కేసీఆర్‌కు పోటీ చేసే అవకాశం కల్పించిందే మదన్‌మోహన్‌ అని గుర్తు చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన మదన్ మోహన్‎పైనే 1983 ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయాడని చెప్పారు. 

కాంగ్రెస్, టీడీపీలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. నమ్మిన వారిని మోసం చేసే గుణం కేసీఆర్ రక్తంలోనే ఉందని ఘాటు విమర్శలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట తిరిగినా ఎవరికైనా పదవులు వచ్చాయా, బాగుపడ్డారా అని ప్రశ్నించారు. ఆయన కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించడంతో పాటు కొడుకు, బిడ్డ, అల్లునికి పదవులు వచ్చాయన్నారు. 

కేసీఆర్, హరీష్ రావుకు అండగా నిలిచిన సోలిపేట రామలింగారెడ్డి కుటుంబం, తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంత్ చారి కుటుంబం, సిరిసిల్లలో పాపారావు, మహేందర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. పదేండ్లు కేసీఆర్ కుటుంబం అమరవీరుల కుటుంబాల భుజాలపైకి ఎక్కి అధికారం  చలాయించిందని విమర్శించారు. 

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కకు పెట్టి.. పార్టీ మారిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం పదేళ్లు రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకుందని విమర్శించారు. ప్రజాపాలన పోవాలి.. పాపాల బైరవుడు కేసీఆర్ మళ్లీ రావాలని బీఆర్ఎస్ వాళ్లు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023లో చెప్పినట్లే తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేశాం.. 2029లో కూడా రాష్ట్రంలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.