హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు వదులుతున్నారంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను తెలంగాణ బిడ్డను. రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఏపీకి నీళ్లు వదులుతానా..? తెలంగాణ హక్కుల కోసమే చంద్రబాబుతో సంబంధాలు తెంచుకోని వచ్చా. నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు నేనెలా అన్యాయం చేస్తా..? అలాంటి ఆలోచన వస్తే నేను తెలంగాణ బిడ్డను అవుతానా..?’’ అని అన్నారు.
గురువారం (నవంబర్ 19) సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే, రూ.5 లక్షల ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 2015లో కేసీఆర్, హరీష్‌రావు కలిసి కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చారని అన్నారు.
దక్షిణ తెలంగాణ రైతుల జీవితాలపై మరణశాసనం రాసి సంతకం పెట్టింది మామ, అలుళ్లు కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం చేస్తూ కేసీఆర్, హరీష్ రావు పెట్టిన సంతకాల కాపీలు, ఫైల్స్ అన్నీ ఉన్నాయని.. అసెంబ్లీకి వస్తే చర్చిద్దామన్నారు. వైఎస్ జగన్‌ను కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిచి రాయలసీమ కట్టుకోమని చెప్పింది వాస్తవం కాదా..? రోజమ్మ రొయ్యల పులుసు తిని.. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పలేదా..? అని నిలదీశారు.
తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ఆంద్రా మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించారు. ఆంధ్రా కార్పొరేట్ కాలేజీలకు వ్యతిరేకంగా గతంలో హరీశ్ ఉద్యమాలు చేశారు.. ఇపుడు అదే కాలేజీలకు పాలు సరఫరా చేస్తున్నారన్నారు. తెలంగాణను నిండా ముంచింది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు.
