2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే.. బీఆర్ఎస్‌కు గతమే భవిష్యత్ లేదు: సీఎం రేవంత్

2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే.. బీఆర్ఎస్‌కు గతమే భవిష్యత్ లేదు: సీఎం రేవంత్

 

సిద్దిపేట: తెలంగాణలో మరోసారి అధికారంలోకి వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని..బీఆర్ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్ లేదని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2034 వరకు ఇందిరమ్మ రాజ్యమే కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. 

కేటీఆర్, హరీశ్ రావు అబద్ధాలు చెబుతూ ఊరువాడా తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు గడ్డం రావడానికి 50 ఏళ్లు పట్టిందని, బుద్ధి రావడానికి ఇంకెన్నేళ్లు పడుతుందోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.కేటీఆర్ తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించారు. సొంత చెల్లినే పట్టించుకోని వారు కోటి మంది మహిళలకు ఎలా మేలు చేస్తారని ప్రశ్నించారు.

మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెబుతూ బీఆర్ఎస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని సీఎం ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను గమనించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ ప్రారంభించిన పథకాల్లో ప్రస్తుతం ఒక్కటీ లేదని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, తనకు ఎలాంటి అహంకారం లేదని స్పష్టం చేశారు.ప్రజల గౌరవానికి ఏనాడైనా భంగం కలిగించానా? అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. ప్రజలతో కలిసి ఉండే వ్యక్తి కావాలా? లేక ప్రజలను బానిసల్లా చూసే వ్యక్తి కావాలా? అని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతల వైఖరిపై విమర్శలు గుప్పించారు.