సిద్దిపేట: సొంత పార్టీ నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నాయకులకు సిద్దిపేట సభ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కొంతమంది నేతలకు ఏమైందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కొంతమంది నేతలకు ఏమైందో ఏమో తెలియదు.. పిచ్చి కుక్క కరిచిందో ఏమో.. పార్టీలోని చెడంతా మైకుల ముందు చెబుతున్నారు. మంచి విషయాలు మాత్రం ఇంటికి వచ్చి నా చెవిలో చెబుతున్నారు. ఇలాగే వ్యవహరించే నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపిస్తారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
పార్టీలో ఏవైనా సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, బహిరంగంగా మాట్లాడి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని పరోక్షంగా రేవంత్ హెచ్చరించారు. నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల పార్టీలో కొందరు నాయకులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
