బొత్స అనూషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

బొత్స అనూషపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేస్తున్నారంటూ   మాజీ మంత్రి ,వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ డాక్టర్ బొత్స అనూష తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, యూట్యూబ్, మెటా సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అభ్యంతరకర వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

అంతేకాకుండా ఈ వీడియోలను ఎవరు రూపొందించారు? ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేశారు? అనే విషయాలను గుర్తించేందుకు అవసరమైన డిజిటల్ ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు, ఇతర సాంకేతిక సమాచారాన్ని భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు.

పిటిషనర్ తరఫు వాదనలు పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకర వీడియోల తొలగింపు, బాధ్యులపై చట్టప్రకారం చర్యలకు సంబంధించి పోలీసులకు సూచనలు చేసింది. విచారణ అనంతరం కేసును డిస్పోజ్ చేసింది. దీంతో సోషల్ మీడియా వేధింపుల వ్యవహారంలో బొత్స అనూషకు హైకోర్టులో ఊరట లభించింది.