న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంస్థాగత నియామకాలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులను నియమించింది. తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులుగా సచిన్ సావంత్, సైమన్ అలెక్స్ నియమితులయ్యారు. ఏపీ, అండమాన్ నికోబార్ దీవులకు ఉమ్మడిగా సెంథమిల్ అరసు, వి.శంకర్‌ను నియమించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు గురువారం (నవంబర్ 19) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ముగ్గురు తెలంగాణ నేతలకు ఛాన్స్
తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలకు ఏఐసీసీ సెక్రటరీలుగా కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించింది. ఒడిషా ఏఐసీసీ కార్యదర్శిగా జట్టి కుసుమకుమార్, కర్నాటక ఏఐసీసీ సెక్రటరీగా సయ్యద్ అజ్మాతుల్లా హుస్సేనీని నియమించింది. ట్రైనింగ్, సందేశ విభాగానికి సంతోష్ కోరుకొండ నియమితులయ్యారు. వీరి నియామకాలకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
