Mayukha OTT Release: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. 'మయూఖ' స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mayukha OTT Release: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్.. 'మయూఖ' స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో  సినిమాలు వస్తుంటాయి.. కానీ కొన్ని చిత్రాలు మాత్రం తమ విభిన్నమైన కథ, కథనంతో ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్సిస్తుంటాయి. అటాంటి ఓ డిఫరెంట్ సైకాలాజికల్ మిస్టరీ థ్రిల్లరే 'మయూఖ'. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోనే కాదు.. అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపైనా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. న్యూయార్క్, కేన్స్ వేదికలపై అవార్డులు, ప్రశంసులు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో, శ్రీ తేజ్ SK (శ్రీకాంత్ కంద్రేగుల) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శశిధర్ నల్ల, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించారు. అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో దేవ్, మురళీధర్ గౌడ్, అమన్ మసూద్, లావణ్య రాణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శిబి మాథ్యూ అలెక్స్ సంగీతం అందించగా, ఫర్హాన్ వడక్కన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. మయూఖ ఓ బ్యాంకులో పనిచేస్తూ ఒంటరిగా జీవించే యువతి. నగరంలో ఒంటరిగా ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుస హత్యలు జరుగుతుంటాయి. మరోవైపు మయూఖ నివసించే ఇంట్లోనూ వింత సంఘటనలు చోటుచేసుకుంటాయి. కనిపించని వ్యక్తి తన ఇంట్లోకి వస్తున్నాడనే భయం ఆమెను వెంటాడుతుంది. అసలు ఆ ఇంట్లోకి వస్తున్నదెవరు? హత్యలకు, మయూఖకు ఏమైనా సంబంధం ఉందా? ఆమె ప్రాణాలకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి? అన్నది తెరపై చూడాల్సిందే.

దర్శకుడు ఈ సినిమాను సాధారణ థ్రిల్లర్‌లా కాకుండా ప్రత్యేకమైన విజువల్ ట్రీట్‌తో రూపొందించారు. స్పానిష్, కొరియన్, హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో మోనోక్రోమాటిక్ లైటింగ్‌ను ఉపయోగించారట. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగే స్లో బర్న్ కథనంతో ఉత్కంఠ పెంచుతూ.. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఊహించని మలుపులతో సెకండాఫ్ వేగం అందుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.

ALSO READ : బాక్సాఫీస్ వద్ద కోట్లు వసూళ్లు చేసినా గుర్తింపులేదు..

ఇక ఓటీటీ విషయానికొస్తే.. నవంబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 23 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు జియో హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను మధ్యలో ఆపకుండా ఒకే సిట్టింగ్‌లో చూడాలని దర్శకుడు ప్రత్యేకంగా సూచిస్తున్నారు. మరి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి 'మయూఖ' ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.