కార్తీక దీపం వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు షరతులివే.!

కార్తీక దీపం వెలిగించేందుకు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు షరతులివే.!

చెన్నై: తమిళనాడులోని మదురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 24న కొండపై ఉన్న దీపత్తూన్‌ (దీపస్తంభం) వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించింది. అయితే ఈ కార్యక్రమాన్ని కేవలం అధికారికంగా నియమించిన బృందం మాత్రమే పోలీసుల భద్రత మధ్య నిర్వహించాలని స్పష్టం చేసింది.

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాల అమలుపై తదుపరి విచారణ వరకు స్టే విధించింది.

సుప్రీంకోర్టు విధించిన నిబంధనలు ఇవే..

  • దీపం వెలిగించే బృందం సభ్యుల సంఖ్య, కూర్పును మదురై జిల్లా కలెక్టర్ నిర్ణయించాలి.
  • ఆలయ ఈవో, పురావస్తు శాఖ (ASI), పోలీస్ కమిషనర్‌తో సంప్రదించి ఏర్పాట్లు చేయాలి.
  • ఎంపిక చేసిన బృందానికి పోలీసు రక్షణ కల్పించాలి. అవసరమైతే సీఆర్‌పీఎఫ్‌ సహాయం తీసుకోవచ్చు.
  • అనుమతి పొందిన బృందం, సంబంధిత అధికారులు తప్ప ఇతరులకు అక్కడ ప్రవేశం ఉండదు.
  • బహిరంగ సభలు, ఊరేగింపులు, నిరసనలు, నినాదాలు నిషేధం.
  • దీపం వెలిగించిన వెంటనే బృందం అక్కడి నుంచి వెళ్లిపోవాలి.
  • తవ్వకాలు, నిర్మాణాలు, ఇతర కట్టడాల్లో మార్పులకు అనుమతి లేదు.
  • సమీపంలోని దర్గా, మసీదుకు వెళ్లే మార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు.
  • ఈ అనుమతి తాత్కాలికమైనదేనని, దీని ద్వారా దీపం వెలిగించే సంప్రదాయ హక్కు లేదా స్థలంపై యాజమాన్య హక్కులు నిర్ధారణ కావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఏమిటీ వివాదం?

తిరుపరంకుండ్రం కొండ మురుగన్ స్వామి ఆరు పవిత్ర క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో పాటు దర్గా కూడా ఉంది. 1920లో కొండ యాజమాన్యంపై వివాదం తలెత్తగా, న్యాయస్థానాలు ఆలయానికి చెందిన ప్రాంతాలను, దర్గాకు సంబంధించిన ప్రాంతాలను వేరు చేశాయి.

1994లో కొండపై దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలని భక్తుడు హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. 1996లో సంప్రదాయ మండపం వద్దే దీపం వెలిగించాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా ఈ అంశం మరోసారి న్యాయస్థానాల ముందుకు వచ్చింది.

నవంబర్ 24న కార్తీక దీపోత్సవం

ఈ ఏడాది నవంబర్ 24న కార్తీక దీపం జరగనుంది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో భరణి దీపం తెల్లవారుజామున, మహాదీపం సాయంత్రం సుమారు 6 గంటలకు వెలిగిస్తారు. ఇళ్లలోనూ సాయంత్రం మట్టి ప్రమిదల్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి భక్తులు పూజలు నిర్వహిస్తారు. తిరుపరంకుండ్రంలో మాత్రం సుప్రీంకోర్టు విధించిన నిబంధనల ప్రకారమే దీపోత్సవం జరగనుంది.