వెజ్ బదులు నాన్-వెజ్ బర్గర్లు : బర్గర్ కింగ్, స్విగ్గీకి రూ. 72 వేల జరిమానా విధించిన కోర్టు

వెజ్ బదులు నాన్-వెజ్ బర్గర్లు : బర్గర్ కింగ్, స్విగ్గీకి రూ. 72 వేల జరిమానా విధించిన కోర్టు

వెజ్ బర్గర్లకు బదులుగా నాన్-వెజ్ బర్గర్లను డెలివరీ చేసిన కేసులో బర్గర్ కింగ్, డెలివరీ యాప్ స్విగ్గీకి కన్జూమర్ కోర్టు షాక్ ఇచ్చింది. వినియోగదారుడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ రెండు కంపెనీలకు కలిపి రూ.72వేలు జరిమానా విధిస్తూ గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చింది.

అసలేం జరిగిందంటే..?
గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన భగవాన్ దాస్ మంగళ 2021 ఏప్రిల్ 2న స్విగ్గీ యాప్ ద్వారా బర్గర్ కింగ్ నుంచి నాలుగు వెజ్ బర్గర్లు ఆర్డర్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన భార్య కోసం వాటిని తెప్పించారు. అయితే ఆమె ఆ సమయంలో తినకపోవడంతో ప్యాకెట్ అలాగే ఉంచేశారు. తర్వాత ఆ బర్గర్లను పిల్లలు తిన్నారు. అయితే రుచి వింతగా ఉండటంతో పాటు పిల్లలకు వికారం, వాంతులు అయ్యాయని మంగళ పేర్కొన్నారు. సాయంత్రం ప్యాకెట్ పరిశీలించగా అది నాన్-వెజ్ అని తేలింది.

ఈ ఘటనపై మంగళ వెంటనే స్విగ్గీకి ఫిర్యాదు చేశారు. పూర్తిగా శాఖాహారులైన తన కుటుంబ సభ్యుల మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ పొరపాటు వల్ల వారు మానసిక వేదనకు గురయ్యారని తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత బర్గర్ కింగ్ ప్రతినిధి తన తప్పును అంగీకరించి.. కోర్టు వెలుపల రాజీ పడదామని ప్రతిపాదించారు. బాధితుడి కుటుంబం కోరుకున్న ఒకటి రెండు పుణ్యక్షేత్రాలకు యాత్రను స్పాన్సర్ చేయడంతో పాటు రూ. 25వేలు పరిహారం ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ అందుకు మంగళ నిరాకరించి వినియోగదారుల కోర్టులో కేసు వేశారు.

కోర్టు తీర్పు..
కమిషన్ ఛైర్మన్ సంజీవ్ జిందాల్, సభ్యులు జ్యోతి సివాచ్, ఖుష్విందర్ కౌర్‌లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. స్విగ్గీ యాప్‌లోని చాట్ హిస్టరీ, ఇన్‌వాయిస్లు, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించిన కోర్టు.. కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. కంపెనీలు చెప్పిన వాదనలను తోసిపుచ్చుతూ బర్గర్ కింగ్, స్విగ్గీలను సంయుక్తంగా బాధ్యులుగా చేస్తూ శిక్ష విధించింది.

ALSO READ : 20 దేశాల్లోని 10 లక్షల మంది క్రెడిట్, డెబిట్ కార్డుల డేటా చోరీ

బాధితులకు కలిగిన మానసిక వేదనకు గానూ రూ. 50వేలు, లీగల్ ఖర్చుల కోసం రూ. 22వేలతో కలిపి మొత్తం రూ.72వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని.. ఒకవేళ గడువు దాటితే 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి కట్టాలని స్పష్టం చేసింది.