చాట్‌జీపీటీతో టెక్ ప్రపంచాన్ని కుదిపేసిన ఓపెన్ఏఐ ఇప్పుడు నేరుగా స్మార్ట్‌ఫోన్ బిజినెస్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌తో మాయ చేసిన సంస్థ హార్డ్‌వేర్ వ్యాపారంలోకి రావడం.. అది కూడా మెుబైల్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్‌లను తయారు చేసే ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థతో చేతులు కలపడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 2027 చివర్లో లేదా 2028లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్ కాంట్రాక్టును ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ అయిన ఎఫ్ఐహెచ్ మొబైల్ దక్కించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆపిల్ సప్లై చైన్‌లో కీలకంగా ఉన్న లక్స్‌షేర్ ప్రిసిషన్, లింగ్‌యి ఐటెక్, ఏఏసీ టెక్నాలజీస్ వంటి సంస్థలు కూడా విడిభాగాలు, ఇతర బాధ్యతల్లో పాలుపంచుకునే అవకాశం ఉంది. తొలుత లక్స్‌షేర్ కో-డిజైన్, తయారీలో ప్రధానంగా ఉంటుందని విశ్లేషకులు భావించినా.. ఇప్పుడు ఈ సప్లై చైన్ మరింత విస్తృతంగా మారుతోంది.
ప్రాసెసర్ విషయంలోనూ ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. మొదట మీడియాటెక్, క్వాల్‌కామ్‌లతో కలిసి ఓపెన్ఏఐ పనిచేస్తోందని, 2028లో భారీగా ఫోన్ల ప్రొడక్షన్ ఉండొచ్చని అంచనాలు వచ్చినా.. ఇప్పుడు మీడియాటెక్ ప్రత్యేక ప్రాసెసర్ సరఫరాదారుగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్ఎంసీ 2nm టెక్నాలజీతో రూపొందే కస్టమైజ్డ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ఆధారిత చిప్‌సెట్‌పై దృష్టి పెట్టి.. 2027 మెుదట్లోనే ఉత్పత్తి వేగవంతం కావచ్చని తెలుస్తోంది.
ALSO READ ; ఏఐ స్టార్టప్‌ని 2 ఏళ్లలోనే రూ.40వేల కోట్లకు అమ్మేసిన ఇండియన్..
ఓపెన్ఏఐ, ఫాక్స్‌కాన్‌ల మధ్య ఇది కొత్త బంధం కాదు. ఏఐ డేటా సెంటర్ పరికరాల కోసం ఇవి గతేడాదే భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. అక్టోబర్ చివర్లో మరిన్ని ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు సంకేతాలు ఇచ్చారు. అయితే ఓపెన్ ఏఐ స్మార్ట్‌ఫోన్ వార్తలను ఇరు సంస్థలు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఏఐ ఆధారిత ఫోన్ నిజంగానే వస్తే స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో లెక్కలు మెుత్తం తలకిందులయ్యే అవకాశం కనిపిస్తోందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.
