ఎన్‌‌హెచ్‌‌-63 విస్తరణకు లైన్ క్లియర్‌‌..జోడువాగులపై కొత్త బ్రిడ్జి, 9.10 కి.మీ. రోడ్డు విస్తరణ

ఎన్‌‌హెచ్‌‌-63 విస్తరణకు లైన్ క్లియర్‌‌..జోడువాగులపై కొత్త బ్రిడ్జి, 9.10 కి.మీ. రోడ్డు విస్తరణ
  •     రూ.80.50 కోట్లతో పనులు చేపట్టనున్న అనుష కన్‌‌స్ట్రక్షన్స్‌‌
  •     మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చొరవతో నిధులు, అటవీ అనుమతులు

కోల్​బెల్ట్​/జైపూర్,వెలుగు: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాలను అనుసంధానించే నిజామాబాద్‌‌– -జగదల్‌‌పూర్‌‌ జాతీయ రహదారి (ఎన్‌‌హెచ్‌‌-63)పై ప్రయాణికుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు-భీమారం, జైపూర్‌‌ మండలాల సరిహద్దులో అటవీ అనుమతులు లేక నిలిచిపోయిన రోడ్డు విస్తరణ, జోడువాగులపై కొత్త వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రం నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయించడంతో పాటు అటవీ అనుమతులు కూడా లభించాయి. నేషనల్‌‌ హైవే ఆఫీసర్లు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయగా, రూ.80.50 కోట్లతో చేపట్టనున్న పనులను అనుష కన్‌‌స్ట్రక్షన్స్‌‌ సంస్థ దక్కించుకుంది. డిసెంబర్‌‌ లాస్ట్​ వీక్​లో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆఫీసర్లు ప్రణాళిక రెడీ చేశారు.

తెలంగాణలో 268 కి.మీ. మేర రహదారి..

నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యే ఎన్‌‌హెచ్‌‌-63 తెలంగాణలో 268 కి.మీ. ప్రయాణించి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాపన్‌‌పల్లి మీదుగా మహారాష్ట్రలోని సిరోంచాకు వెళ్తుంది. అక్కడి నుంచి ఛత్తీస్‌‌గఢ్‌‌లోని జగదల్‌‌పూర్‌‌ వరకు మొత్తం 494 కి.మీ. పొడవున కొనసాగుతుంది. 2000లో ప్రారంభమైన రహదారి పనులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కాలేదు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు-భీమారం, జైపూర్‌‌ మండలాల సరిహద్దులో సుమారు 10 కి.మీ. మేర రహదారి అటవీ ప్రాంతంలో ఇరుకుగా, మూలమలుపులతో ఉంది. జోడువాగులపై ఉన్న పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గతంలో అసంపూర్తిగా మిగిలిన పనులు..

ఎన్‌‌హెచ్‌‌-63 నిర్మాణం మొదటి నుంచి నత్తనడకన సాగుతోంది. 2017లో రసూల్‌‌పల్లి వాగు నుంచి చెన్నూరు బైపాస్‌‌ మీదుగా కోటపల్లి మండలం బబ్బెరచెలుక వరకు 42.4 కి.మీ. మేర రహదారి విస్తరణ, అసంపూర్తి పనుల కోసం కేంద్రం రూ.163.8 కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో మధుకాన్‌‌ ప్రాజెక్ట్స్‌‌ లిమిటెడ్‌‌ టెండర్‌‌ దక్కించుకొని పనులు ప్రారంభించింది. 2019 మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా, గడువు పొడిగించినప్పటికీ పలుచోట్ల పనులు అసంపూర్తిగానే మిగిలాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో రహదారి విస్తరణ, జోడువాగుల వద్ద కొత్త వంతెన నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.

మంత్రి, ఎంపీ చొరవతో రూ.100 కోట్లు మంజూరు.. 

మూడు రాష్ట్రాల ప్రజల ప్రయాణ కష్టాలను గుర్తించిన మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కొత్త వంతెన, రహదారి విస్తరణకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించడంతో పాటు అటవీశాఖ అనుమతులు సాధించారు. జోడువాగుల వంతెనకు ఇరువైపులా రహదారి మరమ్మతులు, నాలుగు కిలోమీటర్ల మేర కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.1.80 కోట్ల నిధులు కూడా సమకూర్చారు.

కొత్త బ్రిడ్జి, 9.10 కి.మీ. రోడ్డు విస్తరణ..

భీమారం-చెన్నూరు మండలాల సరిహద్దులోని జోడువాగులపై కొత్త వంతెన నిర్మించడంతో పాటు జైపూర్‌‌-భీమారం ప్రాంతంలో 9.10 కి.మీ. మేర రహదారిని విస్తరించనున్నారు. జైపూర్‌‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి చెన్నూరు మండలం లింగంపల్లి సమీపం వరకు ప్రస్తుతం ఏడు మీటర్లుగా ఉన్న రోడ్డును పది మీటర్లకు పెంచనున్నారు. పనులు పూర్తయితే మూడు రాష్ట్రాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి.