బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి..రామాయంపేటలో భూనిర్వాసితుల ఆందోళన

బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి..రామాయంపేటలో భూనిర్వాసితుల ఆందోళన

రామాయంపేట, వెలుగు: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో నేషనల్ హైవే  765 డీజీలో కోల్పోతున్న భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భూనిర్వాసితులు గురువారం తహసీల్దార్ ఆఫీస్​ వద్ద ఆందోళనకు చేపట్టారు. తహసీల్​ ఆఫీస్​లో మెదక్ ఆర్డీవో రమాదేవి ఆధ్వర్యంలో భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎకరానికి రూ.4 లక్షలు చెల్లిస్తామని ఆఫీసర్లు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరానికి కోటి రూపాయలు విలువ చేసే భూమికి రూ.4 లక్షలు చెల్లిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశారు. గతంలో భూమికి తగిన నష్టపరిహారం కల్పిస్తామని కలెక్టర్, ఎంపీ చెప్పారని ఆమాట నిలపెట్టుకోవాలన్నారు. బలవంతంగా భూసేకరణ నిలిపివేయాలని, అలాచేస్తే ఆత్మహత్యలే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.