హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో అగ్నిప్రమాదం కారణంగా పసికందులు మృతిచెందిన ఘటనపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు పురోగతిని వెల్లడించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు ప్రస్తుత స్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఫైర్ సేఫ్టీ ఎన్వోసీలు పొందేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అఖిల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సెప్టెంబర్21న ఏసీ వద్ద విద్యుత్ వైర్లను ఎలుకలు కొరకడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇందులో దవాఖాన నిర్లక్ష్యం లేదని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హాస్పిటల్లో ఉన్న 27 మంది పసికందుల్లో 22 మందిని రక్షించినట్లు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రమాదంపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు పురోగతిని అఫిడవిట్‌లో వివరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
