షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలపై కొనసాగుతున్న అన్యాయాలు, వేధింపులు, వివక్ష, దోపిడీని అరికట్టడం కోసం ఎనలేని కృషి చేశారు భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్. భారతదేశ ప్రజలకు ప్రాథమిక హక్కులతో పాటు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించారు. వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల అమలు, పరిరక్షణకు అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారు.
ఎస్సీ, ఎస్టీలపై జరిగే వేధింపులు, అన్యాయాలు, వివక్ష, దోపిడీని అరికట్టడం కోసం భారత రాజ్యాంగంలో అత్యంత పటిష్టమైన రక్షణ కవచంగా ఒక ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థ ఏర్పాటుకు అంబేద్కర్ ఆర్టికల్ 338ను పొందుపరిచారు. దీని ఆధారంగానే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పడ్డాయి. ఎస్సీ, ఎస్టీల హక్కులపై జరిగే దాడులు, ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడం, దోపిడీ, వివక్షకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూడడం ఈ కమిషన్ల ప్రధాన విధి.
యూనిటరీ, ఫెడరల్ లక్షణాలు కలిగిన మన దేశంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన రాజ్యాంగబద్ధ వ్యవస్థకు అనుగుణంగా, రాష్ట్రస్థాయిలో కూడా ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం, 2003’ను రాష్ట్ర శాసనసభ రూపొందించింది. ఈ చట్టం ‘Act 9 of 2003’గా అమలులోకి వచ్చింది. 2014లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 2న అధికారికంగా ఏర్పాటు చేసింది.
నిష్పాక్షికతపై చిక్కు ప్రశ్నలు ?
ఎస్సీ, ఎస్టీ ప్రజల బాధలు, స్థితిగతులపై ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉండటంతోపాటు, రక్షణ చట్టాలు, రాజ్యాంగంపై సరైన అవగాహన ఉన్న సామాజిక ఉద్యమకారులు, సామాజికవేత్తలు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలకు చైర్మన్లుగా, సభ్యులుగా లేకపోవడంతో కమిషన్ నిర్వీర్యం అవుతున్నది. కమిషన్పై ఎస్సీ, ఎస్టీ ప్రజలు నమ్మకం కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణమని బుద్ధిజీవులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన సంస్థలకు చైర్మన్లు, సభ్యులుగా నియమించడం వల్ల సదరు సంస్థల పనితీరులో పారదర్శకత, నిష్పాక్షికత కొరవడే ప్రమాదం ఉందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
నాయకులకు కమిషన్ బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తారు. అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు రాజ్యాంగబద్ధమైన కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు.. ప్రభుత్వంపై వచ్చే సదరు సామాజిక వర్గాల హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, లేదా అధికార పార్టీ నాయకులపై నమోదయ్యే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో కమిషన్ విచారణ నిష్పాక్షికంగా జరుగుతుందా? లేదా? అనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే.
రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత సరికాదు
తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి గురవుతున్న సామాజిక వర్గాలు ఎదుర్కొంటున్న అత్యంత సంక్లిష్టమైన సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటిని సమూలంగా పరిష్కరించేందుకు సముచిత నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిషన్ పెద్దలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనికి ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ ఉనికిలో ఉన్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వ ప్రాధాన్యతల కోసం ఇతర శాఖలకు కేటాయించారు.
దీనిపై కమిషన్ పెద్దలు మౌనం వహించడం ఆయా సామాజిక వర్గాల అభివృద్ధిని అడ్డుకునే తిరోగమన చర్యగా అభివర్ణించక తప్పదనేది విశ్లేషకుల అభిప్రాయం. నిజాయితీకి, నిష్పాక్షికతకు నిలువెత్తు నిదర్శనంగా బాధ్యతలను నిర్వర్తించే సామాజికవేత్తలు, సామాజిక ఉద్యమకారులకు బదులుగా రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన రక్షణలు అందవనే అభిప్రాయాలు విద్యావంతులు, మేధావులు, పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్నాయి.
రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు !
ప్రభుత్వం అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో కూడిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ కమిషన్ రాజ్యాంగం కల్పించిన హక్కులకు దుర్బేద్యమైన రక్షణ కవచంగా నిలిచే బలమైన వ్యవస్థగా పనిచేయాలి. బాధితుల గోడును వినడం, వారిపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించడం, సంబంధిత అధికారులను బాధ్యత వహించేలా చేయడం, చట్టబద్ధమైన పరిష్కారాల కోసం కృషి చేయాలి.
అందుకు చైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ పునరావాసాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, రాజ్యాంగ విలువలపై నిబద్ధత, చట్టపరమైన అవగాహన, సామాజిక న్యాయం పట్ల బాధ్యత, నిష్పాక్షికత, ప్రజాసేవ, అర్హత, అనుభవం, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించినప్పుడే సామాజిక వర్గాల ప్రజల్లో కమిషన్‌పై నమ్మకం మరింత బలపడుతుంది.
ఉద్యమకారులు బాధ్యతలు చేపడితేనే..
తెలంగాణ ఉద్యమకారులను ఆదరించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లుగా నియ మించినట్లుగానే, సామాజిక ఉద్యమకారులకు కూడా ప్రోత్సహించాలి. వారి సేవలకు గుర్తింపుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్లు, సభ్యులుగా నియమించాలి. అలా నియమించడం ద్వారా వారు సమాజం కోసం చేసిన త్యాగాలకు, సేవలకు తగిన గౌరవం కల్పించినట్లవుతుంది. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడే సామాజిక ఉద్యమకారులకే ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న బాధలు, సమస్యలు, ఇబ్బందులపై క్షుణ్ణమైన అవగాహన ఉంటుంది. అలాంటి ఉద్యమకారులు కమిషన్లలో బాధ్యతలు చేపట్టినప్పుడే బాధితుల గొంతుకకు సరైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం మరింత బాధ్యతతో సమాజ సేవలో నిమగ్నమయ్యే అవకాశం కల్పించినట్లవుతుంది.
సామాజిక ఉద్యమకారులకు ప్రాధాన్యతనివ్వాలి
ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ, రాజ్యాంగం, చట్టాలపై లోతైన అవగాహన కలిగిన సామాజిక ఉద్యమకారులకు చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలి. అలా చేసినప్పుడే కమిషన్‌కు సార్థకత చేకూరడంతోపాటు, అది మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆయా వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఈ క్రమంలో బాధితుల సమస్యలను నిష్పాక్షికంగా పరిశీలించి, వారికి చట్టబద్ధమైన న్యాయం అందించడంలో కమిషన్ మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించగలదు.
పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగుల సమస్యలపై గళమెత్తడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రైతుల సమస్యలతోపాటు వివిధ ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి, వారి హక్కుల పరిరక్షణ కోసం చట్టసభల వెలుపల నిరంతరం పోరాడటానికి సామాజిక ఉద్యమకారులు, సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తల అవసరం నేటి సమాజంలో అత్యంత ఆవశ్యంగా ఉంది.
మానిక్ డొంగ్రే, సోషల్ వర్కర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ open [email protected]
