వందేళ్లు జీవించటం చాలా అరుదు. లక్షల్లో ఒకరో, ఇద్దరికో మాత్రమే ఆ భాగ్యం దక్కుతోంది. అలాంటి అరుదైన గొప్ప వ్యక్తుల్లో చుక్కా రామయ్య ఒకరు. ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో ధవళ వస్రాలు, ధోతి ధరించి ఇంటి పెద్దలాగా అనిపించే స్ఫురద్రూపి. చూడ ముచ్చటైన రూపం. ఆయన 90వ దశకం నుంచి రెండు, మూడు దశబ్దాల పాటు తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా జెన్ జీకి చుక్కా రామయ్య కంటే ఐఐటీ రామయ్య గానే సుప్రసిద్ధుడు. పేరొందిన ఇంజనీర్లను ప్రపంచానికి అందించిన భారతదేశ ఐఐటీలలో ప్రవేశం కోసం జరిగే పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్పేవారు.
మొదటిసారి చూసిన వారికెవరికైనా, పంచె కట్టుకున్న ఈ పెద్ద మనిషి ఐఐటీ ప్రవేశ పరీక్షలకు పాఠాలు చెబుతారా అనే సందేహం కలగటం సహజం. కానీ, ఏటా ఆయన వద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థుల్లో 90 శాతానికి పైగా ర్యాంకులు రావడంతో అవన్నీ పటాపంచలు అయ్యేవి. రాష్ట్రానికి ఐఐటీ రావడంలో ఆయన కృషి , పట్టుదల ఎనలేనిది.
నైజాం వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటంలో..
చుక్కా రామయ్య జీవితంలో ఇది ఒక పార్శ్యం మాత్రమే. ఆయన ఉత్తమ కమ్యూనిస్టు కూడా. నేను తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 2009లో శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాను. రామయ్య కూడా అదే సమయంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన నియోజకవర్గం మా జిల్లా పరిధిలో కూడా ఉండేది. ఎక్కువగా విద్యావేత్తగానే ఆయన గురించి విన్నాను. అయితే, ఇద్దరం ఒకే కాలంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో పలుమార్లు సంభాషించడం జరిగింది. అప్పుడు కమ్యూనిస్టుగా ఆయన లోతు తెలిసే అవకాశం లభించింది. ఇదెలా సాధ్యమైందని ఒకసారి అడగగా రామయ్య ఇలా చెప్పారు.
'నైజాం వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటకాలంలో నేను ఔరంగబాద్, జాల్నా జైలులో ఉండగా ధర్మభిక్షంగారితో ఏడాది గడిపాను. ఆనాడు ఆయన జైలులో మాకు మార్క్సిజం సిద్ధాంత పాఠాలను చెప్పి, వాటిని జీవితంలో ప్రతి అడుగునా ఎలా అన్వయించుకోవాలో, ఎలా విశ్లేషించుకోవాలో చెప్పేవారు. జైలులో ఉండగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నన్ను ఉపాధ్యాయ వృత్తి ఎంచుకోవడం ద్వారా కూడా దేశ సేవ చేయవచ్చని చెప్పారు.అలా ధర్మభిక్షంగారి మాటలు నాపై గాఢమైన ప్రభావాన్ని చూపాయని’ వివరంగా చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా..
మార్క్సిజం ప్రతిపాదించిన గతి తార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం అచరణాత్మక అన్వయం చుక్కా రామయ్య జీవితంలోని వివిధ దశల్లో కనపడతాయి. దేశం బానిస సంకెళ్ల విముక్తి కోసం, నిజాం రాచరిక, భూస్వామ్య వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్వాతంత్ర్య సమరయోధుడిగా తన పాత్రను పోషించారు. కఠిన జైలు జీవితాన్ని అనుభవించారు.
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించిన తరువాత సమాజానికి జ్ఞానజ్యోతులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆ తరువాత మెరుగైన సమాజం కోసం శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కొత్తతరం అవసరమైన తరుణంలో ఐఐటీ రామయ్యగా మారారు. అసమాన అభివృద్ధి, వివక్షతలపై గొంతెత్తుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జన జాగృతికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. శాసనమండలిని పునరుద్ధరించినప్పుడు ఆయన అనుభవం అవసరమని గుర్తించి ప్రజలే ఆయనను పెద్దల సభకు ఎన్నుకున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సభలో చర్చల ద్వారా తన వంతుగా చట్టాల పరిపుష్టికి కృషి చేశారు.
ఐఐటీ రామయ్య
తాను జన్మించిన భూమి దాస్య శృంఖలాలను బద్దలుకొట్టి, అభివృద్ధి పథాన నడవాలని కోరుకున్న అసలు సిసలు భూమి పుత్రుడు రామయ్య. ఆయన తన జీవితంలోని ప్రతి దశలో సంపూర్ణంగా దేశం, సమాజం కోసం పాటుపడిన గొప్ప దేశ భక్తుడు. ఐఐటీ కోచింగ్ పేరుతో లక్షలు రూపాయలు వసూలు చేసే కార్పొరేట్ కళాశాలలు, కోచింగ్ సెంటర్‌లకు ప్రత్యామ్నాయ నమూనాను ఆయన విజయవంతంగా చూపించారు. బట్టీ చదువులకు బదులుగా మూలాన్ని అర్థం చేసుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యా రంగం కార్పొరేటీకరణ చెంది, చదువులు భారంగా మారిన ప్రస్తుత తరుణంలో ఐఐటీ రామయ్య నమూనా చదువులు రావాలి. అప్పుడే విద్యార్థులు దేశ నిర్మాణానికి పాటుబడే భావితరంగా రూపొందుతారు.
శతాధిక వయోఃజనుడైన నిస్వార్థ జీవి
చుక్కా రామయ్య బహుముఖీనుడు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు, శాసనమండలి సభ్యుడు, విద్యావేత్త, మేధావి, ఉన్నత సమాజం కోసం ఇప్పటికీ తాపత్రయపడే దార్శనికుడు. ఆయా పాత్రలలో ఆయన నిష్కామకర్మ యోగిగా కృషి సల్పిన ఉత్తమోత్తముడు. ఐఐటీల్లో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్న ఆయన శిష్యులు అనేకమంది గురుదక్షిణగా ఆయనకు సుఖవంతమైన జీవనానికి ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించి, నేటికీ సాధారణ ఇంటిలోనే నిరాండంబర జీవితం గడుపుతున్న ఆదర్శ కమ్యూనిస్టు రామయ్య.
ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. నాడూ, నేడూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వెలుతురు ప్రసరించడంలో కమ్యూనిస్టు మేధావులే ముందున్నారనేందుకు ఆయనే ఒక నిదర్శనం. చుక్కా రామయ్య సమాజ సంపద. శతాధిక వయోః జనుడైన నిస్వార్థ జీవి. ఆయన జీవితం సర్వ కాలాలలో ఆదర్శవంతమైనది. ఆయన తపించిన శాస్త్రీయ దృక్ఫథం కూడిన విజ్ఞానవంతమైన సమ సమాజం కోసం అందరం పాటుపడాలి. అదే చుక్కా రామయ్య అందించిన సేవలకు మనం ఇచ్చే అసలైన గౌరవం. కామ్రేడ్ చుక్కా రామయ్యకి కమ్యూనిస్టు పార్టీ తరఫున 101వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
కూనంనేని సాంబశివరావు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ [email protected]
