టెహ్రాన్: హార్మూజ్ జలసంధిలో మరోసారి కలకలం రేగింది. జలసంధికి తూర్పు భాగంలో మూడు చమురు ట్యాంకర్లు సముద్ర గర్భంలోని మైన్లను (నౌకాదళ మందుపాతరలు) ఢీకొనడంతో వాటిలో మంటలు చెలరేగాయి. ఈ మేరకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) గురువారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఇరాన్ నావికాదళం జారీ చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా ఆ ట్యాంకర్లు నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించాయని ఐఆర్జీసీ ఆరోపించింది. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు నౌకలు తమ నావిగేషన్ వ్యవస్థలను స్విచ్ ఆఫ్ చేశాయని వివరించింది. మైన్ల పేలుడు ధాటికి మంటలు వ్యాపించి మూడు నౌకలు కదలలేని స్థితికి చేరుకున్నాయని వెల్లడించింది.
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిగుండా ప్రయాణించే నౌకలన్నీ తప్పనిసరిగా ఇరాన్ అధికారుల అనుమతితో , నిర్దేశిత మార్గాల్లోనే వెళ్లాలని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అయితే, ప్రమాదానికి గురైన 3 ట్యాంకర్ల పేర్లు, ఏ దేశాలకు చెందినవి, వాటిలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు లేదా ప్రాణనష్టం జరిగిందా అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు.
