వెలుగు స్పెషల్ : భారత ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేదెలా?

వెలుగు స్పెషల్ : భారత ప్రజాస్వామ్యాన్ని  ముందుకు తీసుకెళ్లేదెలా?

నెహ్రూ గొప్ప మేధావి, రాజకీయవేత్త.  రెండో ప్రపంచ యుద్ధ ప్రభావం వల్ల తలెత్తిన అల్లర్ల నేపథ్యంలో ఆయన జాతీయవాదాన్ని  ప్రజల జాతీయవాదంగా మార్చారు. రాజకీయ మార్పును గ్రహించి ఆయన సామ్యవాదం గురించి మాట్లాడారు. అప్పటివరకు నాయకుల జాతీయవాదంగా ఉన్న ప్రజల తీవ్రవాదాన్ని సామ్యవాద నినాదాల కిందకు తీసుకురావడం జరిగింది. 1940లలో సామ్యవాదం ఒక ప్రపంచవ్యాప్త  ప్రత్యేక విషయంగా ఉండేది.  

తీవ్రవాద రాజకీయ ధోరణులన్నింటినీ ఏకం చేయడానికి దీనిని ఉపయోగించారు. కానీ నెహ్రూగానీ, ఆయన అనుచరులుగానీ  సామ్యవాదాన్ని భారత ప్రజాస్వామ్య లక్ష్యంగా పేర్కొనలేదు.  వారిదృష్టిలో దేశాన్ని ఏకం చేయడానికి సామాజిక న్యాయమే అత్యంత  అవసరం.  భారత సామాజిక వాస్తవికతలోని సామాజిక విభజనలపై మన రాజ్యాంగ నిర్మాతలకు స్పష్టమైన అవగాహన ఉంది. యూరోపియన్ల దృష్టిలో కులం ఒక అవమానకరమైన వ్యవస్థ, వారు దేశమనే భావనను కూడా ఎగతాళి చేశారు. 

అందువల్ల భారతీయులందరినీ ఒకే దేశ ప్రజలుగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి, న్యాయమనే భావన ద్వారా మనల్ని ఒక దేశంగా తీర్చిదిద్దడమే రాజ్యాంగం  ప్రాథమిక లక్ష్యమైనది.  అందువల్ల రాజ్యాంగం కొన్ని కులాలను గుర్తించి, వాటిని ఇతరులతో  సమానంగా ఉన్నతీకరించింది. ఈ మార్గాన్ని న్యాయం అని పిలిచారు. 
 ఇది సోషలిజం కాదు ఒక భారతీయ భావన. 

రాజ్యాంగం ప్రాథమిక లక్ష్యం ఇంకా నెరవేరలేదు.  సిద్ధాంతాలు ఇకపై  దేశ ప్రజాస్వామ్యాన్ని పాలించలేవు. సైద్ధాంతిక రాజకీయాలు కేవలం అధికారం కోసం చేసే ఆచరణాత్మక పనులకు దిగజారిపోయాయి. ప్రజలు తమ అత్యవసర డిమాండ్లను తీరుస్తారనే ఆశతోనే  ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తున్నారు.  నైతిక విలువల కొరత కారణంగా రాజకీయాలు దూషణలతో నిండిపోయాయి. నాయకులు ఉచితాలు అందించే పథకాలతో  కుల ప్రాతిపదికన పార్టీలను కూడా నిర్మిస్తున్నారు. మరోవైపు  రాజకీయంగా ఆశలు పెట్టుకున్న చాలామంది కార్యకర్తలు ఒకటి, రెండు సీట్లు గెలుచుకోవడానికి  ఏదో ఒక పార్టీతో  పొత్తు పెట్టుకోవడానికి  పార్టీలను  నమోదు చేసుకున్నారు. పతనమవుతున్న ప్రజాస్వామ్యాలకు నేడు సైద్ధాంతిక ప్రత్యామ్నాయం అత్యవసరం. 

ఓటర్ల నిరాశతోనే ప్రతిపక్షానికి అధికారం

నెహ్రూ వంటి  మేధావి  నాయకులు ఆధునిక అభివృద్ధి కారణంగా పెద్ద సంఖ్యలో నిమ్న కులాల వారు వృత్తులను కోల్పోవడం వల్ల అసమానతలు కొనసాగుతున్నాయని గుర్తించారు. తాము నిమ్న కులాలకు చెందినవారమనే కారణంతోనే తమకు అన్యాయం జరుగుతోందని అణగారిన వర్గాలు భావిస్తున్నాయి. ఉన్నత సామాజిక వర్గాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుని,  విద్య, పెట్టుబడుల అవకాశాలను ఉపయోగించుకుని తమ ఆధిపత్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాయని వారు నమ్ముతున్నారు. ఓటర్లుగా మారిన దిగువ వర్గాల వారు ఈ మార్పును అర్థం చేసుకున్నారు. ఈ విధంగా ఓటర్ల స్థాయిలో రాజకీయ శక్తి గల నేతలు ఏర్పడ్డారు. వారు రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను నిరంతరం ప్రశ్నిస్తూ, దూషిస్తూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదేవిధంగా  ఆ పార్టీ  ప్రవర్తిస్తుంది. దీంతో  విసుగెత్తిన  ప్రజలు తీవ్ర నిరాశతో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ఏదో ఒక  ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది.  అధికార పార్టీ తీరుపై  ఓటర్ల నిరాశ వల్లనే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది.  ఇది  ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఇది ఏదైనా అవాంఛనీయ మార్గానికి దారితీస్తుందా? అని ప్రశ్నిస్తే.. ఆ అవకాశం ఉంది.

న్యాయమే పరిష్కారం

తమ ఓటు పట్ల  చైతన్యం పొందుతున్న ప్రజల అవసరాలను తీర్చడానికి, సంపదను సృష్టించే క్రమంలో ప్రజాస్వామ్యం సరళీకరణ మార్గాన్ని తీసుకుంది.  అయితే ఈ విధంగా సృష్టించిన అపారమైన సంపద చివరికి  పెట్టుబడిదారుల నియంత్రణలోకి వచ్చింది. ఈ మార్పులో రాజ్యం.. అంటే రాజకీయ వర్గం కీలక పాత్రను పోషించింది.  మాల్స్ ఏర్పాటు చేయడం,  కాంట్రాక్టులు తీసుకోవడం, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కులపరమైన  సంబంధాలతో  దిగువ స్థాయిలోనూ ఈ సంపదను కాజేస్తున్నారు. ఇది  ప్రజాస్వామ్య వ్యవస్థాపకులు ఊహించిన మార్గం నుంచి,   రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్న న్యాయ మార్గం నుంచి వైదొలగి ఇప్పటివరకు పాలించిన రాజకీయ వర్గం పక్కకు మళ్లింది. అందువల్ల పెరుగుతున్న అసమానతలు, కుల ఆధారిత పార్టీ వ్యవస్థల దృష్ట్యా న్యాయ మార్గాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయ న్యాయం కోసం పార్టీని స్థాపించాలి, దాని ద్వారా సామాజిక న్యాయాన్ని నెలకొల్పి భారతదేశాన్ని ఒక దేశంగా తీర్చిదిద్దాలి.

సామాజిక న్యాయ పార్టీ అంటే ఏమిటి?

నేటి రాజకీయ నాయకుడు వ్యవస్థను మార్చడానికి బదులుగా, తనను తాను అటువంటి రాజకీయాలకు గురి చేసుకుంటున్నాడు.  రాజకీయ నాయకుడు  వాస్తవికతను అంచనా వేయడానికి రోజువారీ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఒక పార్టీ ఒక కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తుంటే, మరో పార్టీ ఇతర కులాలపై రాజకీయాలను నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. కులం ఆధారంగా ఒక పార్టీని స్థాపించడం కేవలం అధికారం కోసం మాత్రమే.  అలాంటి మరో పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా తప్పును సరిదిద్దలేం. ఊహించిన న్యాయ మార్గాన్ని తిరిగి  తీసుకురావడం ఒక చారిత్రక కర్తవ్యం.  కులాన్ని నిర్మూలించి భారతదేశాన్ని ఒకే ప్రజల దేశంగా మార్చడమే దానికి మార్గం. 

  కొత్త పార్టీ పేరు ఏదైనప్పటికీ, అది కుల వ్యవస్థకు వ్యతిరేకంగానే ఉండాలి. రాజ్యాంగాన్ని అనుసరించి కులరహిత సమాజాన్ని స్థాపించడం ఒక గొప్ప చరిత్రాత్మక పని.  చారిత్రక తప్పిదాలను సరిదిద్దడం అనేది రాజ్యాంగ నిర్మాతలు ఊహించిన దానికంటే నేడు ఒక గొప్ప ఊహగా మారింది. ఐరోపా భారత జాతీయ ఉద్యమాన్ని ఎగతాళి చేసినందుకే రాజ్యాంగ నిర్మాతలు కులరహిత దేశాన్ని కోరుకున్నారు.  భారతదేశాన్ని ఒకే ప్రజల దేశంగా మార్చడమే 21వ శతాబ్దపు న్యాయ ఉద్యమం లక్ష్యం.  అది అగ్ర కులాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. అయితే,  అగ్రకులాలు  తమ కులాలను  స్థాపిత రాజకీయ పార్టీ కింద ఏకం చేసి ప్రజల అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నారో గమనించాలి. 

పేదరికాన్ని నిర్మూలించడానికి జాతీయవాదం, సామ్యవాదం వంటి చారిత్రక భావనలను ఉపయోగించి వారు ప్రజలను ప్రేరేపించారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని సంక్షోభాన్ని నివారించడానికి ఒక పార్టీని స్థాపించడం అనేది ఒక జాతీయ పిలుపు. సమాజంలోని ప్రతి వర్గాన్ని పరిపాలనలో భాగం చేయడమే దీని ఉద్దేశం.   ప్రజాస్వామ్యానికి  విజ్ఞానవంతులు, రాజకీయ సామర్థ్యం ఉన్నవారందరూ ప్రాతినిధ్యం వహించాలి.  అణగారినవారు ఈ చారిత్రక కర్తవ్యానికి నాయకత్వం వహించాలి. 

దారితప్పిన ప్రజాస్వామ్యం

నేడు పార్లమెంటు కుల బంధాలు, ధనబలంతో ఏర్పడింది. అధిక సంఖ్యలో ప్రజలను అధికారం నుంచి మినహాయించారు.  ఎందుకంటే  వారు ఉన్నత కులానికి చెందినవారు కాదు, వారికి ధనబలం కూడా లేదు.  మొదట్లో వారిని సామాజికంగా బహిష్కరించారు. దిగువ స్థాయి ఓటర్లను ఓటు వేయవద్దని కూడా బెదిరించారు.  కానీ  నేడు వారు చైతన్యవంతులయ్యారు.  దీంతో  ఓటు వేయడానికి ఓటర్లకు లంచాలు సైతం ఇస్తున్నారు.  కొంతమంది ఓటర్లు  ఒక పూట భోజనానికి ఓటు వేసేంతగా దిగజారిపోయారు. 

ఇటువంటి ఎన్నికల ద్వారా ఏర్పడిన  ప్రభుత్వం  తమ సమస్యలను పరిష్కరించదని వారికి బాగా తెలుసు. అయినప్పటికీ, ఎన్నికల ద్వారా ప్రభుత్వం రావడం సర్వసాధారణం కాబట్టి వారు చిత్తశుద్ధితో పోలింగ్ బూత్‌‌కు వెళతారు.  రాజ్యాంగం గుర్తించని కులాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. రాజ్యాంగం కొన్ని కులాలకు సాధికారత కల్పించడానికి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చింది. కానీ వారిని అధికారం నుంచి వెలివేశారు. రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు సాధికారతను కల్పించాయా అంటే ఆశించిన స్థాయిలో  లేదు.  పైగా వారు పొందిన ప్రయోజనాల స్థాయిని బట్టి వారిని ఉప -విభజన చేశారు. దీంతో వారు రాజకీయ వర్గాలుగా అభివృద్ధి చెందకుండా నిమ్న 
కులాలుగానే మిగిలిపోయారు.

రాజకీయ న్యాయమే కొత్త పార్టీల లక్ష్యంగా ఉండాలి

ప్రజాస్వామ్యంలో  నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థను బలవంతంగా అమలుచేయడం ఒక రాజకీయ పరిణామం.  అదే  కులాన్ని ఒక రాజకీయ సంస్థగా మార్చింది. కొత్త పార్టీల లక్ష్యం రాజకీయ న్యాయం అయి ఉండాలి. రాజకీయ న్యాయం కోసం నిలబడే రాజకీయ వర్గాలుగా మారడానికి ఈ సిద్ధాంతం అందరినీ ఏకం చేయాలి.    అయితే వెనుకబడిన తరగతుల సమస్యలలో ఒకటి, వారిని కుల ప్రాతిపదికన గుర్తించడం. భారతదేశం  గణతంత్ర రాజ్యంగా మారిన రోజే అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఆవిర్భవించింది. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌‌లలో వారిని కుల ప్రాతిపదికన ఉప విభజన చేశారు. బీసీ, ఎస్సీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ వారిని ఒక  నిర్దిష్ట  కులానికి చెందినవారిగానే గుర్తించారు. వెనుకబడిన తరగతులు అనేవి ఆచరణలో విభిన్న హోదాలు లేదా వర్గ విభజనలతో కూడిన కులాలే.  సామాజిక న్యాయం అనే సిద్ధాంతం కింద వారి ఐక్యత మొట్టమొదటి చారిత్రక కర్తవ్యం. ఇది ఉన్నత కులాలకు వ్యతిరేకం కాదు,  ప్రజాస్వామ్యాన్ని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే రాజకీయ కర్తవ్యం. 

ఆర్థిక న్యాయం కోసం సంపదను ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలి

ప్రాతినిధ్య  సంక్షోభం నుంచి  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి,  కులాన్ని నిర్మూలించడానికి, భూములు,  వనరులపై  కుల ఆధిపత్యాన్ని నివారించడానికి, సాంఘిక న్యాయ ఉద్యమమే ఏకైక పరిష్కారం.  గ్రామ సామరస్యాన్ని కాపాడి దానిని రాజకీయ న్యాయంగా మార్చడం అవసరం.  ప్రజాస్వామ్యం సమతావాదాన్ని స్థాపించలేదు.పైగా ఆధిపత్య రాజకీయ కులాలకు సంపదను సృష్టించింది.  ఆర్థిక న్యాయం కోసం సంపదను ప్రభుత్వ అధీనంలోకి తీసుకురావాలి.  దురుసు రాజకీయాలకు పాల్పడకూడదు,  కేవలం చారిత్రక అవసరాన్ని తీర్చడానికే పనిచేయాలి. ఎటువంటి సిద్ధాంతం లేకపోవడం వల్ల ప్రజలను భావోద్వేగానికి గురిచేయడానికి అగ్రవర్ణ పార్టీలు సృష్టించినవే ఈ దురుసు రాజకీయాలు. అది అధికారంలోకి రావడానికి ఒక వ్యూహంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభం నుంచి  ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి  సాంఘిక న్యాయ పార్టీలు అందరి మద్దతు కోరాలి. 

ప్రొ. ఇనుకొండ తిరుమలి
చరిత్రకారుడు

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]