దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara). శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషించగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇవాళ (నవంబర్ 20, 2026న) పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? దుల్కర్ కెరియర్లో మరో స్ట్రాంగ్ తెలుగు హిట్ పడిందా? అనేది రివ్యూలో చూద్దాం..
కథగా..
పాలలంక అనే మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి)కి అంతరిక్షంలోకి వెళ్లాలి.. ఆస్ట్రోనాట్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుండి ఉన్న పెద్ద కల. కానీ పేదరికం వైపు, అమ్మాయిలకు చదువు ఎందుకు అనే తండ్రి మరోవైపు. అయినా తల్లి సపోర్ట్ తో పదో తరగతి పూర్తి చేస్తుంది. రిజల్ట్స్ వచ్చేలోపు మెకానిక్ కృష్ణ ( దుల్కర్ సల్మాన్) కి ఇచ్చి పెళ్లి చేస్తారు. చదువులో ఆమె ప్రతిభ, ఆస్ట్రోనాట్ అవ్వాలన్న ఆమె బలమైన కోరిక తెలుసుకున్న కృష్ణ.. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంటర్ లో చేరుస్తాడు. కేరళలో ఐఐటీ సీట్ వస్తుంది. గుజరాత్ క్వారీలో డ్రైవర్ గా డబుల్ షిఫ్ట్ చేస్తూ తనను చదివిస్తాడు. కానీ ఆమె తొలి ప్రయోగమే విఫలం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది..? ఆమెను ఆస్ట్రోనాట్ గా చూడాలనుకున్న కృష్ణ ప్రయత్నం ఫలించిందా..? ఈ ప్రయాణంలో రోహిణి ( శ్రుతి హాసన్) ఎలా హెల్ప్ అయింది లాంటి అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అన్నట్టుగానే ప్రతి స్త్రీ విజయం వెనుక ఓ మగాడు ఉంటాడు అన్నది ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్. ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్న ఓ అమ్మాయి కథ ఇది. అలాగే ఆమె కల సాకారం అవడానికి సపోర్ట్ చేసిన భర్త కథ కూడా. కల్పన బాల్యంతో సినిమా మొదలవుతుంది. ఆమె ఎందుకు ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది, ఆమె చదువుకు ఎదురైన ఆటంకాలతో కథ నెమ్మదిగా ముందుకెళ్తుంది. మరోవైపు గుజరాత్ క్వారీలో పనిచేస్తున్న హీరో, బిజిలీ (రుహానీ శర్మ)కి మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత కథ మళ్లీ ప్లాష్ బ్యాక్‌లోకి వెళ్లినా స్లోగానే ఉంటుంది. అయితే పెళ్లి తర్వాతి సీన్స్,, ఆమెకు అండగా కృష్ణ నిలబడే సీన్స్‌తో కథలో వేగం పెరగడంతో పాటు ఎమోషనల్‌గా సినిమా కనెక్ట్ అవుతుంది. ఆమె చేసిన తొలి రాకెట్ ప్రయోగం విఫలం అవడం, యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందా అనే ఆసక్తిని ఇంటర్వెల్ సీన్స్ రేకెత్తించాయి. సెకండాఫ్‌లో వచ్చే శ్రుతిహాసన్ క్యారెక్టర్ సినిమాకు కొత్త జోష్ తీసుకొచ్చింది. కానీ ఆమెకు హీరోహీరోయిన్లు దగ్గరయ్యే సన్నివేశాలన్నీ ప్రేక్షకులు ముందే ఊహించేవిధంగా ఉన్నాయి. అలాగే వరుస ఫెయిల్యూర్స్ వస్తున్నా వాటినుంచి కొత్త అవకాశాలు రావడం లాంటి అంశాలు పూర్తిస్థాయి సినిమాటిక్‌గా అనిపిస్తాయి. అయితే భార్యభర్తల మధ్య కెమిస్ట్రీ, తండ్రీ కూతురు మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుడిని సినిమాకు కనెక్ట్ చేస్తాయి. భార్య కలను నెరవేర్చడం కోసం హీరో ఎందుకు అంతలా తపనపడ్డాడు అనే బ్యాక్ స్టోరీ బాగుంది. ముఖ్యంగా చివరి అరగంట ఎమోషనల్ రైడ్‌లా సాగుతుంది. నిజానికి ఈ సినిమా ప్రధాన కథ ఏమిటో టీజర్, ట్రైలర్లోనే చూపించారు. క్లైమాక్స్ ఏమిటనేది కూడా ప్రేక్షకులకు ముందే తెలుసు. ఇలాంటి ఓ కథను ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వకుండా చెప్పడం అంత ఈజీ కాదు. అయితే దర్శకుడు పవన్ సాధినేని ఎంగేజింగ్‌గా, ఎమోషనల్‌గా కథను నడిపించాడు. కామెడీ, రొమాన్స్, డ్యూయెట్స్‌కు స్కోప్ ఉన్నా ఆ వైపు డీవియేట్ కాకుండా తాను చెప్పాలనుకున్న ప్రధాన కథపైనే దృష్టి పెట్టాడు. తను నిజాయితీగా చేసిన మంచి ప్రయత్నం ఇది. ఊహించదగ్గ కథ కనుక ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే ఈ ఎమోషనల్ రైడ్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
నటీనటుల పెర్ఫార్మన్స్..
దుల్కర్ సల్మాన్‌కు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఎమోషనల్ సీన్స్‌ను అలవోకగా చేసుకు పోయాడు. సాత్వికకు తొలిచిత్రం అయినప్పటికీ ఆ పాత్రకు తగ్గ స్థాయిలో నటించి ఆశ్యర్చపరిచింది. వీరితో పాటు శ్రుతిహాసన్ నటన మరో బిగ్ ప్లస్ పాయింట్. బిజిలీ పాత్రలో రుహానీ శర్మ, హీరోకు అక్కపాత్రలో స్వాసిక, హీరోయిన్ తండ్రిగా కోట జయరాం, ఇతర ముఖ్యపాత్రల్లో నాజర్, మురళీశర్మ, ప్రవీణ్, చైతన్య జొన్నలగడ్డ, గౌతమ్ మీనన్ పాత్రల పరిధిమేరకు నటించారు. దర్శకుడు పవన్ సాధినేని కూడా ఓ సీన్లో మెరిశాడు.
టెక్నీకల్ అంశాలు..
జీవి ప్రకాష్ మ్యూజిక్, పాటల్లోని సాహిత్యం ఆకట్టుకున్నాయి. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కే ఎల్ ఎడిటింగ్ బాగున్నాయి. ‘‘పదిమంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మినా చాలు.. నా ప్రేమ కంటే ఆమె లక్ష్యం గొప్పది.. నీ కల ఆకాశం అయినప్పుడు ఈ భూమితో ఏం చేసుకుంటా.. ఆకాశం ఎంత ఎత్తైనా మనిషి భుజాలపై నుండి అందుకున్నా” లాంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. కొన్నిచోట్ల కాంప్రమైజ్ అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.
