ఆదిలాబాద్: గాడిదల చోరీకి వచ్చి పోలీసులకు చిక్కి..పట్టుబడ్డ ఏపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు

ఆదిలాబాద్: గాడిదల చోరీకి వచ్చి పోలీసులకు చిక్కి..పట్టుబడ్డ ఏపీకి చెందిన ఐదుగురు వ్యక్తులు

ఆదిలాబాద్, వెలుగు : గాడిదలను చోరీ చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం తెల్లవారుజామున లాండా సాంగ్వి క్రాస్‌‌రోడ్ వద్ద ఎస్సై మహమ్మద్ హారూన్ అలీ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వారిని చూసి బొలెరో పికప్ వాహనం వెనక్కి తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వారిగా గుర్తించారు. 

కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు గాడిదలు, గొర్రెలను దొంగిలించి విక్రయించాలని పథకం వేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగా గాడిదలను దొంగిలించేందుకు ఆదిలాబాద్‌‌కు వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. గతంలో ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో చీరాలకు చెందిన మల్లి నిఖిల్, దల్లి శ్రీను, పురపాలానికి చెందిన పఠాన్ ఇమ్రాన్, పొంగులూరుకు చెందిన దేవరకొండ సాయి, కొత్తపాలానికి చెందిన దేవరకొండ భవానీ ప్రసాద్ ఉన్నారు. వీరంతా బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సంజయ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.