- రామగుండంలోని మేడిపల్లి ఓసీపీ ప్రాజెక్టులో ప్లాంట్ ఏర్పాటు
- ఆసక్తి కలిగిన సంస్థల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న జల, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల పనుల్లో స్పీడ్పెరగనుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థ ఇప్పుడు పవర్ జనరేషన్రంగంలో విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం-1 ఏరియాలోని మూతపడిన మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గని నీటి సంపును ఆధారంగా చేసుకొని 500 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు యాజమాన్యం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
సింగరేణి భూమిలో రెవెన్యూ షేరింగ్ విధానంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అనుభవం కలిగిన సంస్థలు ముందుకు రావాలని గురువారం ఆహ్వానించింది. ఆసక్తి గల సంస్థలు డిసెంబర్ 10లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. సుమారు రూ.3 వేల కోట్లతో నిర్మించనున్న ఈ విద్యుత్ ప్లాంట్ భవిష్యత్తులో సింగరేణికి ఆదాయ వనరుగా మారనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ లిమిటెడ్‌తో రూపొందించారు.
