ఫైరింజన్ లేటు.. పంటకు చేటు.. వికారాబాద్ జిల్లా లఖ్నాపూర్లో మక్క, కంది పంటకు అగ్గి.. కలెక్టర్ మీటింగుకు పోయిన ఫైరింజన్ !

ఫైరింజన్ లేటు.. పంటకు చేటు.. వికారాబాద్ జిల్లా లఖ్నాపూర్లో మక్క, కంది పంటకు అగ్గి.. కలెక్టర్ మీటింగుకు పోయిన ఫైరింజన్ !
  • బూడిదైన ఐదుగురు రైతుల ఆశలు
  • గుండెలవిసేలా రోదించిన అన్నదాతలు

పరిగి వెలుగు: ఆరు నెలల కష్టపడితే వచ్చిన పంట అది..అమ్మితే వచ్చే పైసలతో మరికొద్ది నెలలు బుక్కెడు బువ్వ తినొచ్చు..ఇంట్ల ఖర్సులు ఎల్లదీయొచ్చు అనుకున్నారా రైతన్నలు.. కానీ వారొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్టు కండ్ల ముందే కష్టార్జితం బుగ్గిపాలైంది. తమ ఎదుటే పంట తగలబడుతుంటే ఫైరింజన్​వచ్చి ఆపుతుందని ఫోన్​ చేశారు.

కానీ, అది కలెక్టర్​ మీటింగుకు పోయిందని తెలుసుకుని ఆశలు వదులుకున్నారు. అక్కడున్న మట్టి, దుబ్బ, నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆరు నెలలు కన్న బిడ్డల్లా సాకిన పంట అగ్నికి ఆహుతి అవుతుంటే కాపాడుకోలేక గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన వికారాబాద్​జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్​లో జరిగింది.

చేతికి వస్తుందనే లోపే..
లఖ్నాపూర్​ గ్రామానికి చెందిన చాకలి అంజిలయ్య నాలుగు నెలల కింద 4 ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాల్లో కంది వేశాడు. చాకలి యాదయ్య కూడా ఎకరంలో మొక్కజొన్న వేశాడు. బేరి అనంతయ్య రెండెకరాల్లో కంది, పక్క గ్రామానికి మరో ఇద్దరు రైతులు నాలుగెకరాల్లో కంది వేశారు. అందరి కంది పంట మరో నెలలో చేతికి రాబోతోంది. 

ఐదెకరాల్లో వచ్చిన మొక్కజొన్న కంకులను వారం కింద ఏరి మెషీన్​పట్టించడానికి పొలం దగ్గర వేశారు. గురువారం మధ్యాహ్నం పక్క చేనులో ఓ రైతు తన పొలంలోని కొయ్యను కాలపెట్టడానికి నిప్పు పెట్టాడు. ఈ నిప్పురవ్వలు బాధిత రైతుల పొలంలోకి వచ్చి పడ్డాయి. మంటలు మొదలై క్రమక్రమంగా వ్యాపించి కుప్ప పెట్టిన కంకులు, కంది పంటకు అంటుకున్నాయి.

ఫైరింజన్​ లేటు.. పంటకు చేటు
 మంటలంటుకోవడంతో గమనించిన బాధిత రైతులు ఫైరింజన్ ​కోసం కాల్​ చేశారు. అయితే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిగి టౌన్​లో ఫైరింజన్​ అందుబాటులో లేదని తెలిసింది. కలెక్టర్ ​దీపక్ ​తివారీ పరిగి మండలం కాళ్లాపూర్ ​గ్రామంలో ఇండస్ట్రియల్​ కారిడార్​ కోసం నిర్వహించిన గ్రామ సభకు రాగా, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడికి  పంపించామని చెప్పారు.

టెన్షన్ ​పడొద్దని 20 కిలోమీటర్ల దూరంలోని వికారాబాద్ ​నుంచి ఫైరింజన్​ను వెంటనే పంపిస్తామని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకు కాల్​ చేస్తే ఆ ఫైరింజన్ ​వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు దాటింది. ఫైర్ ​ఫైటర్స్​అక్కడికి వెళ్లేసరికి బూడిదే మిగిలింది. కేవలం 20 కిలోమీటర్ల దూరానికి రెండు గంటలకు పైగా తీసుకోవడంతో రైతన్నల కష్టం బుగ్గి పాలైంది.

కష్టం కాలిపోతోందిరా దేవుడా..
చాకలి అంజిలయ్య మొక్కజొన్న, కంది పంటకు రూ. లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాడు. ఈసారి మంచి దిగుబడి వచ్చింది. రేటు కూడా బాగానే పలుకుతోంది. ప్రైవేట్​లో ప్రతిసారి రూ. 2100 ఇస్తే ఈసారి అది రూ. 3200కు చేరింది. ఎంత లేదన్నా రూ.3.5 లక్షల వరకు వస్తాయని ఆశపడ్డాడు. అలాగే, చాకలి యాదయ్య రూ. లక్ష, ఇతర రైతులు కూడా తమకు ఈసారి బాగానే ఆదాయం వస్తుందని అనుకున్నారు.

కానీ, పంటకు నిప్పంటుకుని కాలిపోతుంటే నిస్సహాయులై ఏమీ చేయలేకపోయారు. ఘటన జరిగినప్పుడు అంజిలయ్య, ఆయన భార్య అక్కడే ఉన్నారు. ‘దేవుడా..ఏం చేసుడు...కండ్లముందే కష్టం కాలిపోతుందే...అయ్యో భగవంతుడా నువ్వే దిక్కు’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడున్న రైతులను ‘ఏదన్నా చేసి మంటలు ఆర్పండయ్యా..’ అని కాళ్లా వేళ్లా పడడం కన్నీళ్లు తెప్పించింది.