ఫిబ్రవరి 24 నుంచి  ఇంటర్ ఎగ్జామ్స్ ..మార్చి 20 వరకు నిర్వహణ

ఫిబ్రవరి 24 నుంచి  ఇంటర్ ఎగ్జామ్స్ ..మార్చి 20 వరకు నిర్వహణ
  • ఫిబ్రవరి 1 నుంచి సెకండియర్, 11 నుంచి ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ 
  • జనవరి 20 నుంచి ఫస్టియర్ ఇంటర్నల్స్, 27న ఎన్విరాన్‌‌మెంటల్ ఎడ్యుకేషన్, 29న ఎథిక్స్ పరీక్షలు
  •  టైమ్ టేబుల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు 

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు రాష్ట్రంలో ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సెకండియర్, 11 నుంచి ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్.. జనవరి 20 నుంచి ఫస్టియర్ ఇంటర్నల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2027 ఫిబ్రవరి/మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్‌‌‌‌ను ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అభిలాష అభివన్ గురువారం రిలీజ్​చేశారు. షెడ్యూల్ ప్రకారం.. థియరీ పరీక్షలన్నీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు జరుగుతాయి. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి19తో, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 20తో ముగియనున్నాయి. ఇవే తేదీలు ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకు కూడా వర్తిస్తాయి. అయితే, సబ్జెక్టుల వారీగా ఒకేషనల్ కోర్సుల టైమ్ టేబుల్‌‌ను విడిగా విడుదల చేయనున్నారు. 

తొలిసారి  ఇంటర్నల్ ఎగ్జామ్స్ 

ఈ ఏడాది నుంచి తొలిసారిగా ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. జనవరి 20 నుంచి 25 వరకు ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. 27న ఎన్విరాన్‌‌మెంటల్ ఎడ్యుకేషన్, 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక్కో రోజు చొప్పున జరుపుతారు. అలాగే, ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలను ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండియర్ విద్యార్థులకు 30న నిర్వహించనున్నారు. 

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ 

సెకండియర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఆదివారాలతో సహా జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. ఫస్టియర్ సైన్స్ ప్రాక్టికల్స్ కొత్త విధానం ప్రకారం.. ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు ఆదివారంతో సహా నిర్వహిస్తారు. ఒక్కో సెషన్ రెండు గంటల చొప్పున రోజుకు మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో సెషన్–1 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సెషన్–2 మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, సెషన్–3 మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.