నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు– -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండికొట్టి డిండి ప్రాజెక్టుకు సాగునీటిని తరలించే కుట్రలను అడ్డుకోవాలని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ అంశంపై ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, ప్రధాన కాలువల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు డిస్ట్రిబ్యూటరీ కాలువలను నిర్మించాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ల పాలనలో కాలువల సామర్థ్యం పెంపు, మరమ్మతులు చేపట్టలేదని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యం వల్లే కాలువల సామర్థ్యం తగ్గి పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందడం లేదని విమర్శించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంలోని మూడు మోటార్లు దెబ్బతినగా, రెండు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు. అన్ని మోటార్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి రిజర్వాయర్లను నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని కోరారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు బాలా గౌడ్, లక్ష్మయ్య, కౌన్సిలర్ అర్జునయ్య, సత్యం పాల్గొన్నారు.
