హైదరాబాద్, వెలుగు: ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన అద్దె బస్సు డ్రైవర్ ను విధుల నుంచి తొలగిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 12 న హైదరాబాద్..1 డిపోకు చెందిన అద్దె బస్సు డ్రైవర్ సూర్య, ఎంజీబీఎస్ నుంచి రాయచూర్ కు వెళ్లే మార్గంలో ఓ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన ఘటన అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు..డ్రైవర్ నిజంగానే దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు. అతన్ని విధుల నుంచి తప్పించారు.
మరో అర్హత కలిగిన డ్రైవర్ ను నియమించే వరకు ఆ బస్సు సేవలను వినియోగించుకోరాదని సంబంధిత డిపో అధికారులను యాజమాన్యం ఆదేశించింది. అలాగే.. సూర్యకు ఏ ఆర్టీసీ డిపోలో ఏ అద్దె బస్సుపై డ్రైవర్ గా విధులు అప్పగించరాదని డిపో మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. బస్సులో ప్రయాణికులతో ఏ డ్రైవర్ అయినా దురుసుగా ప్రవర్తిస్తే ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040...69440000, 040..23450033 కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చని ఆర్టీసీ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీలోని ఏ ఉద్యోగి అయినా సరే ప్రయాణికుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
