పద్మారావునగర్, వెలుగు : గురు నానక్ 557వ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గురుద్వారా సాహిబ్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు సర్దార్ కుల్దీప్ సింగ్ సలుజా ఆధ్వర్యంలో గురువారం భారీ నగర్ కీర్తన ధార్మిక శోభాయాత్ర నిర్వహించారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాస్‌పోర్ట్ ఆఫీస్ మీదుగా..క్లాక్ టవర్, ప్యాట్నీ సర్కిల్, మోండా మార్కెట్, ఆల్ఫా హోటల్, పాలికా బజార్ గురుద్వారా మీదుగా కొనసాగి తిరిగి సికింద్రాబాద్‌లోని గురుద్వారా సాహిబ్‌కు చేరుకుంది.
ఇందులో జథా తేరా జథా, స్త్రీ సత్సంగ్ బృందాలతో పాటు నాందేడ్ నుంచి వచ్చిన మరాఠా జథా, అమృత్సర్ నుంచి వచ్చిన జై తేగ్-గన్ గత్కా అఖారా, దశమేష్ కల్గిధర్ జథా కళాకారులు కత్తి, బల్లెం, కర్రసాము ప్రదర్శించి అబ్బురపరిచారు. శోభాయాత్రకు స్వాగతం పలుకుతూ చాలా చోట్ల స్వీట్లు పంచారు. అశోక్ బజార్ శ్రీ గురు సింగ్ సభ అధ్యక్షుడు సర్దార్ గుర్చరణ్ సింగ్ బగ్గా, ప్రధాన కార్యదర్శి సర్దార్ రణబీర్ సింగ్ గాంధీ, కమిటీ సభ్యులు సర్దార్ జోగేందర్ సింగ్ ముజ్రాల్, సర్దార్ తరణ్దీప్ సింగ్ భాటియా పాల్గొన్నారు.
