90 మెడికల్ షాపులకు నోటీసులు..క్యూర్ రీజియన్ సహా పలు జిల్లాల్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్

90 మెడికల్ షాపులకు నోటీసులు..క్యూర్ రీజియన్ సహా పలు జిల్లాల్లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్యూర్ రీజియన్ సహా పలు జిల్లాల్లో ని 90 మెడికల్ షాపులకు టీజీ సేఫ్ నోటీసులు జారీ చేసింది. మత్తు, అలవాటు కలిగించే షెడ్యూల్ హెచ్1, షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ అక్రమ విక్రయాలను అరికట్టేందుకు టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్, ఎన్​ఫోర్స్‌‌మెంట్ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం సంయుక్త దాడులు నిర్వహించారు. కోఠి, అబిడ్స్, బషీర్‌‌బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌‌పేట్, ఎస్ఆర్ నగర్, సనత్‌‌నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్‌‌గూడ, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌‌ తో పాటు పలు జిల్లాల్లో డెకాయ్ ఆపరేషన్లు, టెస్ట్ పర్చేజ్‌‌లు చేపట్టారు.

ట్రామడాల్, అల్ప్రజోలం, నైట్రాజెపామ్, కోడైన్ దగ్గు సిరప్‌‌లు, టపెంటడాల్, ప్రీగబాలిన్, జోల్పిడెమ్ తదితర మందులు, యాంటీబయాటిక్స్ అమ్మకాలను తనిఖీ చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, రిజిస్టర్లు, సేల్స్–పర్చేజ్ బిల్లులు లేకుండానే అమ్మకాలు జరపడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలు 90 షాపుల్లో గుర్తించి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940 కింద లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు కోసం షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 

రికార్డులు తప్పనిసరి

షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ మందులను రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌‌ తోనే అమ్మాలని, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని టీజీసేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమంగా విక్రయిస్తే లైసెన్సు రద్దుతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నివారణకు ప్రజలు అర్హత గల డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌‌తోనే యాంటీబయాటిక్స్ కొని వాడాలని, అతి వినియోగం హానికరమని సూచించారు. మత్తు మందుల అక్రమ విక్రయాలపై పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు టోల్ ఫ్రీ నంబర్ 1800–-599–-6969కు ఫిర్యాదు చేయాలని కోరారు.