సన్న వడ్ల రేట్లు ఢమాల్..నెలలోపే క్వింటాల్‌‌ పై రూ.1,400 తగ్గింపు

సన్న వడ్ల రేట్లు ఢమాల్..నెలలోపే క్వింటాల్‌‌ పై  రూ.1,400 తగ్గింపు
  •      గత నెల రేటుపెంచి పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారులు
  •      బియ్యం అక్రమ పెంపు ధరలకు కళ్లెం వేసిన రాష్ట్ర ప్రభుత్వం
  •      ఇప్పుడు సిండికేట్‌‌గా మారి రేటు తగ్గించిన దళారులు
  •      కొనుగోలు సెంటర్లులేక రైతులకు మరిన్ని తిప్పలు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో సన్నవడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఎల్‌‌నినో ఎఫెక్ట్​తో వరి సాగు తగ్గడంతో తొలుత వ్యాపారులు రైతుల వద్దకే వచ్చి పోటీపడి పంటలు కొనుగోలు చేశారు. వరికోతలు పూర్తయ్యేవరకు ఎదురు చూడకుండా పొలాల వద్దే కాంటాలు పెట్టి, పచ్చివడ్లకే అధిక ధర చెల్లించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా వెంటనే అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదంతా గత నెల ముచ్చట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఊరూరా దళారులు సిండికేట్‌‌గా మారి క్వింటాల్‌‌ వడ్ల ధరలను భారీగా తగ్గించారు. దీంతో ఎల్‌‌నినో ప్రభావంతో పంట దిగుబడి తగ్గినా, మిగిలిన పంటకైనా మంచి ధర వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. మరోవైపు ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు సెంటర్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులకు మరిన్ని తిప్పలు తప్పట్లేదు. 

గత నెలలో రూ.4 వేల ధర..

ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌లో కేంద్ర ప్రభుత్వం గ్రేడ్‌‌-–ఏ సన్నరకం వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌‌కు రూ.2,461 గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో దళారుల కొర్రీల తర్వాత కనీసం రూ.2 వేలైనా వస్తుందని రైతులు భావించారు. కానీ, ఉమ్మడి వరంగల్‌‌తో పాటు పలు జిల్లాల్లో వ్యాపారులు గ్రేడ్‌‌–-ఏ సన్నరకం పచ్చివడ్లను క్వింటాల్‌‌కు రూ.3,800 నుంచి రూ.4 వేల వరకు కొనుగోలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రైతులకు దాదాపు రెట్టింపు ధర లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 7 రకాల సన్నవడ్లకు క్వింటాల్‌‌పై రూ.500 బోనస్‌‌ కూడా కలిసివచ్చింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించింది.

బియ్యం ధరల దందాకు సర్కారు బ్రేకులు

రైతుల వద్ద ధాన్యాన్ని అధిక ధరలకు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఆ తర్వాత బియ్యం ధరలను భారీగా పెంచి దందా మొదలుపెట్టారు. క్వింటాల్‌‌ వడ్లకు రైతులకు అదనంగా రూ.1,000 చెల్లించిన వ్యాపారులు, బియ్యం విక్రయించే సమయానికి క్వింటాల్‌‌పై రూ.2 వేల నుంచి రూ.2,300 వరకు ధరలు పెంచారు. ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌ బియ్యం ధర రూ.5,600 నుంచి రూ.8 వేలకు, జైశ్రీరామ్‌‌ స్టీమ్‌‌ రైస్‌‌ రూ.6,500 నుంచి రూ.9 వేలకు, జైశ్రీరామ్‌‌ రా రైస్‌‌ రూ.7,500 నుంచి రూ.9,500కు పెరిగింది. బీపీటీ రా రైస్‌‌ (విజయ మసూరి) ధర కూడా రూ.5 వేల నుంచి రూ.7 వేలకు కృత్రిక కొరత చూపించి ధరల దందా చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా సివిల్‌‌ సప్లై, టాస్క్‌‌ఫోర్స్‌‌ ఆఫీసర్లను రంగంలోకి దించింది. అక్రమ బియ్యం గోదాంలు, అధిక ధరలకు విక్రయాలు, ప్రముఖ కంపెనీల లోగోలతో సాధారణ బియ్యం అమ్మకాలు, బస్తాల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిపై తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ చర్యలతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

క్వింటాల్‌‌పై రూ.1,400 తగ్గింపు

నెల కింద పొలాల వద్దకే వచ్చి పచ్చివడ్లను క్వింటాల్‌‌కు రూ.3,800 నుంచి రూ.4 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.2,600 మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే నెల రోజుల్లోనే క్వింటాల్‌‌పై ఏకంగా రూ.1,400 ధర తగ్గింది. దీంతో ఆలస్యంగా కోతలు చేపట్టిన రైతులు, వివిధ కారణాలతో ధాన్యాన్ని విక్రయించకుండా నిల్వ చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యత, తాలు పేరుతో వ్యాపారులు ధరల్లో కోత విధిస్తున్నారు. వారు చెప్పిన ధరకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డబ్బుల చెల్లింపులోనూ వ్యాపారులు నిర్ణయించిన గడువే అమలవుతోంది. మరోవైపు గ్రామాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా దళారులు ధరలు తగ్గిస్తుండటంతో సన్నవడ్ల రైతులకు నష్టాలు తప్పడం లేదు.

పొలాల వద్దే కాంటాలు..
ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో వానాకాలం సీజన్‌‌లో సాధారణంగా 9.50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈసారి ఎల్‌‌నినో ఎఫెక్ట్​తో సాగు విస్తీర్ణం సుమారు 5.50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. దీంతో అందుబాటులో ఉన్న సన్నవడ్లకు డిమాండ్‌‌ పెరిగింది. మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా గ్రామాలకు వచ్చి పోటీపడి ధరలు చెల్లించారు. సాధారణంగా ధాన్యం ఆరిన తర్వాత కొనుగోలు చేసే వ్యాపారులు ఈసారి వరికోత జరిగిన వెంటనే పొలాల వద్దే కాంటాలు పెట్టారు. పచ్చివడ్లనే కొనుగోలు చేసి తరలించారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు, మార్కెట్‌‌కు ధాన్యం తీసుకెళ్లే ప్రయాస తప్పాయి.

పంట పోయింది.. ధర పోయింది
వడ్ల ధరలు నెలలోపే అడ్డగోలుగా తగ్గినయ్‍. దసరా సమయంలో మా పొలాల వద్దకొచ్చి క్వింటాల్‍ పచ్చివడ్లకు రూ.3,800 అంతకంటే ఎక్కువ ధరకు తీసుకెళ్లిన్రు. ఇప్పుడేమో అదే పంటకు క్వింటాల్‍ రూ.2,600 చెబుతున్రు. ఇంకా నాణ్యత, తాలు అంటూ తగ్గిస్తున్నారు. ఎల్‍నినో వల్ల పంట నష్టపోయినం.. ఇప్పుడు ఒక్కో క్వింటాల్‍పై రూ.1400 ధర తగ్గడంతో మరింత లాస్‍ అయితనం.
- పొగులకొండ రాజమల్లు (రాయపర్తి, వరంగల్‍ జిల్లా) 

దళారులు సిండికేట్‍ అయిన్రు..
చాలా చోట్ల వడ్లుకొనే దళారులు సిండికేట్‍ అయిన్రు. గతనెల వారే మా పొలాల వద్దకొచ్చి ఒకరికంటే మరొకరు రైతులకు ఎక్కువ ధర కట్టివ్వగా, ఈసారి వారందరూ ఒక్కటై, ఒక్కటే ధర డిసైట్‍ చేస్తాన్రు. గతంలో మాదిరి కొనుగోలు సెంటర్లు అందుబాటులో లేకపోవడంతో దళారులు చెప్పిందే వేదమైతాంది.

- సీహెచ్‍.శ్రీనివాస్‍ (హసన్‍పర్తి, హనుమకొండ జిల్లా)