పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని రాణిగంజ్ జంక్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు ఈ నెల 20 నుంచి 8 నెలల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ఆంక్షలు విధించారు. తవ్వకం పనుల కారణంగా ఈ మార్గంలో కేవలం వన్లేన్మాత్రమే అందుబాటులో ఉండనున్నది. దీనివల్ల రాణిగంజ్, ఎంజీ రోడ్డు, ట్యాంక్ బండ్, కర్బలా మైదాన్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. దీంతో రాణిగంజ్ నుంచి ప్యారడైజ్, బోయిన్పల్లి వైపు వెళ్లే రూట్లో టూ వీలర్లు, ఆటోలు, కార్లను మాత్రమే అనుమతిస్తారు. ప్యారడైజ్, మినిస్టర్ రోడ్డు వైపు నుంచి వచ్చే తేలికపాటి వాహనాలను రాణిగంజ్ చౌరస్తా వద్ద డిస్టిలరీ రోడ్డు మీదుగా కర్బలా జంక్షన్ వైపు, నల్లగుట్ట వద్ద నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ఇక ఆర్టీసీ బస్సులు, ట్రావెల్ బస్సులు, గూడ్స్ వంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. ఎస్బీఐ చౌరస్తా, ప్యాట్నీ, ప్లాజా, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, కర్బలా మైదాన్, ట్యాంక్ బండ్ (సెయిలింగ్ క్లబ్, పాత అంబేద్కర్ విగ్రహం) జంక్షన్ల వద్ద భారీ వాహనాలను బేగంపేట, క్లాక్ టవర్, ముషీరాబాద్, కవాడిగూడ, ఆర్టీసీ చౌరస్తా వైపు మళ్లించనున్నారు. భారీ వాహనాల నియంత్రణకు ప్యాట్నీ, ప్యారడైజ్, పార్క్ లేన్, రసూల్‌పురా, కర్బలా చౌరస్తాల వద్ద 10 అడుగుల ఎత్తు పరిమితి కడ్డీలను ఏర్పాటు చేస్తున్నారు.
