హైదరాబాద్, వెలుగు: చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా రెండో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్రకటించింది. జాతీయ న్యాయసేవాధికార సంస్థ (నాల్సా) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్, సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
గవర్నర్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర సంబంధిత వర్గాల సహకారంతో కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న 138వ సెక్షన్ కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
