- బయల్దేరిన కాసేపటికే మనసు మార్చుకుని వెనక్కి వచ్చా
- ఆపై రెండు మూడు రోజుల తర్వాత ధైర్యం చేసి వెళ్లి కలిశాం
- ఇంగ్లిష్ సరిగా వచ్చేది కాదు..అందుకే ఫ్రెంచ్‌లో మాట్లాడా: సోనియా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తొలిసారి కలవాల్సి వచ్చినప్పుడు తీవ్రంగా భయపడ్డానని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. ఏదో కారణం చెప్పి తొలి భేటీని వాయిదా వేశామని, కానీ కొన్ని ర రోజులకే ధైర్యం తెచ్చుకుని వెళ్లి కలిశామని వెల్లడించారు. తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ రిలీజ్‌తోపాటు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో సోనియా మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కేంబ్రిడ్జిలో చదువుకుంటున్న టైమ్‌లో రాజీవ్‌గాంధీ తన తల్లికి లేఖ రాస్తూ.. తాను ఒక అమ్మాయిని కలిశానని, ఆమెను ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పారని సోనియా గుర్తుచేసుకున్నారు.
ఆ లేఖతో ఆశ్చర్యపోయిన ఇందిరాగాంధీ.. లండన్‌లో తనను కలిసేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఇందిరాగాంధీని కలవడానికి రాజీవ్‌తో కలిసి బయలుదేరినప్పటికీ, కేంబ్రిడ్జి నుంచి లండన్‌కు మధ్యలోనే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘నేను మీ అమ్మను కలవను’ అని రాజీవ్‌తో చెప్పినట్లు సోనియా పేర్కొన్నారు. ఆ తర్వాత ఎర్ర టెలిఫోన్ బూత్ కోసం వెతికి, హైకమిషన్‌లో బస చేస్తున్న ఇందిరాగాంధీకి ఫోన్ చేసి ఓ సాకు చెప్పి ఆ భేటీని వాయిదా వేసుకున్నట్లు వివరించారు.
మళ్లీ రెండు మూడు రోజులకే ధైర్యం తెచ్చుకుని రాజీవ్‌తో కలిసి ఇందిరాగాంధీని కలిసేందుకు వెళ్లినట్లు సోనియా చెప్పారు. అప్పటికి ఇందిర అలసటతో విశ్రాంతి తీసుకుంటున్నారని, తన గురించి ప్రశ్నలు అడిగారని గుర్తుచేసుకున్నారు. తనకు ఇంగ్లిష్ సరిగా రాకపోవడంతో ఫ్రెంచ్‌లో మాట్లాడానని తెలిపారు.
అత్తగా ఎప్పుడూ కఠినంగా ఉండలేదు
పెళ్లయిన కొత్తలో ఇక్కడి భిన్నమైన సంస్కృతి కారణంగా మొదట్లో చాలా విషయాలు తనకు కొత్తగా అనిపించేవని సోనియా తెలిపారు. అయితే ఇందిర ఎప్పుడూ ‘ఇది చేయాలి.. అది చేయకూడదు’ అంటూ ఆంక్షలు విధించలేదని చెప్పారు. ఆమె ఎంతో క్రమశిక్షణతో పనిచేసేవారని, తెల్లవారుజామునే తన పనులు ప్రారంభించేవారని గుర్తుచేసుకున్నారు. ఒకసారి తన దుస్తుల అంచు ఊడిపోవడంతో ఇందిర స్వయంగా సూది, దారంతో కుట్టి సరిచేశారని పేర్కొన్నారు.
తన వివాహం జరిగిన ఇంటి మూలను చూపిస్తూ.. ‘అక్కడే టేబుల్ ఏర్పాటు చేసి, పత్రాలపై సంతకాలు చేసి పెళ్లి చేసుకున్నాం’ మని వీడియోలో తెలిపారు. తమది చాలా చిన్న వివాహమని, నెహ్రూ, కట్జు, కౌల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారని చెప్పారు. ‘ప్రపంచానికి ప్రధానిగా కనిపించిన ఇందిర.. ఇంట్లో మాకు ప్రేమగా కథలు చెప్పే, జ్ఞానం పంచే, హాస్యచతురత కలిగిన నానమ్మ’ అని సోనియా పేర్కొన్నారు.
