26 ఏండ్లల్లో 20 బదిలీలు..ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కమిట్‌‌మెంట్‌‌తో పనిచేస్తా:ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌ డీజీ సజ్జనార్‌‌

26 ఏండ్లల్లో 20 బదిలీలు..ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కమిట్‌‌మెంట్‌‌తో పనిచేస్తా:ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌ డీజీ సజ్జనార్‌‌
  • కొందరు వ్యక్తిగత ప్రయోజనం కోసమే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ‘బదిలీలు నాకు కొత్తేమీ కాదు. ఎక్కడ ఏ పోస్టు ఇచ్చినా తగ్గేదే లేదు. వెనుకాడేదే లేదు.. అదే స్పీడ్‌‌, అంతే కమిట్‌‌మెంట్‌‌తో హార్డ్‌‌వర్క్‌‌ చేస్తా”అని  ఫైర్ సర్విసెస్‌‌ డీజీ సజ్జనార్‌‌‌‌ అన్నారు. 26 ఏండ్ల తన పోలీసు సర్వీసులో 20 సార్లు బదిలీ అయ్యానని..17 పోస్టులకు ఛార్జ్‌‌ తీసుకోగా,  మూడు పోస్టింగ్స్‌‌లలో ఆర్డర్‌‌‌‌ తీసుకునే లోపు క్యాన్సిల్‌‌ అయ్యాయయన్నారు. ఒకే ఏడాదిలో మూడుసార్లు బదిలీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని, ట్రాన్స్‌‌ఫర్స్‌‌ తనకేమీ కొత్త కాదని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ సీపీ నుంచి బదిలీ అయిన ఆయన గురువారం తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్సె డిపార్ట్మెంట్‌‌ డీజీగా ఛార్జ్‌‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్‌‌‌‌ మాట్లాడుతూ.. బదిలీల గురించి ఆలోచించకుండా అప్పగించిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు.

అందరి చరిత్రలు ప్రజలకు తెలుసు 

కొందరు తమ వ్యక్తిగత ప్రయోజన కోసం తన పేరు, ఫొటోలు ఉపయోగిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీబీఐ మాజీ డీజీ నాగేశ్వరరావును ఉద్దేశించి సజ్జనార్‌‌ కామెంట్ చేశారు. కాంట్రవర్సీల జోలికి తాను వెళ్లబోనని.. కానీ అందరి చరిత్రలు ప్రజలకు తెలుసని చెప్పారు. తాను విధుల్లో ఉన్న ఐపీఎస్‌‌ అధికారినని.. రోడ్డుపైకి వచ్చి వివాదాలకు దిగే పరిస్థితి లేదని తెలిపారు. ప్రతి ఆరోపణకు కాలమే సమాధానం చెబుతుందని, అవసరమైనప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంవల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని చెప్పారు. త్వరలోనే అవసరమైన లీగల్‌‌ చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. 

చిత్తశుద్ధితో పనిచేయడమే నా విధానం

ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేయడమే తన విధానమని సజ్జనార్ స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు, ప్రచారాలకు స్పందిస్తూ సమయం వృథా చేసుకోకుండా విధులపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. బదిలీలు ఎన్ని వచ్చినా, బాధ్యతలు మారినా తన పని తీరులో మార్పు ఉండబోదని వెల్లడించారు. ప్రస్తుతం అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాద సమయంలో స్పందించే వేగాన్ని పెంచడం, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. 

ఫైర్‌‌ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెడతా

పాత భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లలో ఫైర్‌‌ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రజలు కూడా సమర్థవంతంగా స్పందించేలా ఫస్ట్‌‌ రెస్పాండర్‌‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఫైర్‌‌, ఎస్‌‌పీఎఫ్‌‌ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు ఐదు వేల మంది సిబ్బందికి గ్రాండ్‌‌ హెల్త్‌‌ ఛాలెంజ్‌‌ అమలు చేయనున్నట్లు చెప్పారు. సిబ్బంది ఆరోగ్యం, సామర్థ్యం మెరుగుపడితే ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా ఉంటాయని పేర్కొన్నారు. గత ఏడాది అగ్నిమాపక శాఖ రూ.700 కోట్ల విలువైన ఆస్తులను, 214 మంది ప్రాణాలను కాపాడిందని సజ్జనార్‌‌ వివరించారు. అగ్నిప్రమాదాల నివారణతో పాటు అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.