పీయూసీ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త వాహనాలకు 3 ఏళ్ల గడువు.. పాతవాటికి 3 నెలలే!

పీయూసీ నిబంధనల్లో కీలక మార్పులు.. కొత్త వాహనాలకు 3 ఏళ్ల గడువు.. పాతవాటికి 3 నెలలే!
  • పొల్యూషన్ సర్టిఫికెట్ ఇకపై మూడేండ్లు.. 
  • బీఎస్6 కొత్త వెహికిల్స్​కు గడువు పెంపు
  • పదేండ్లు దాటిన వాహనాలకు ఆరు నెలలే
  • 1989 నాటి రూల్స్​ సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ: వాహన కాలుష్య నియంత్రణ(పీయూసీ) సర్టిఫికెట్ల కాలపరిమితి నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. ఇకపై వాహనం యొక్క ఉద్గార ప్రమాణాలు, వయస్సు, కేటగిరీ ఆధారంగా సర్టిఫికెట్ చెల్లుబాటు గడువు ఆధారపడి ఉంటుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ (16వ సవరణ) రూల్స్, 2026లో భాగంగా 1989 నాటి నిబంధనలలోని రూల్ 115(7)ను సవరిస్తూ కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొత్త ప్రైవేట్ బీఎస్6 కారుకైనా, పాత కమర్షియల్ బీఎస్6 వాహనానికైనా ఒకేవిధంగా ఏడాది కాలపరిమితి ఉండేది. కానీ తాజా సవరణలతో ఆ విధానం పూర్తిగా మారింది. ఆరేళ్ల లోపు వయస్సు ఉన్న కొత్త ప్రైవేట్ బీఎస్6 వాహనాలకు ఇకపై ఏడాదికి బదులుగా మూడేళ్ల కాలపరిమితితో పీయూసీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. 

ఆరేళ్లు దాటి 10 ఏళ్ల లోపు ఉన్న వాహనాలకు ప్రతి ఏడాదికి ఒకసారి, 10 ఏళ్లు దాటిన వాటికి ప్రతి 6 నెలలకు ఒకసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఇక ఆరేళ్ల లోపు కమర్షియల్ బీఎస్4 వాహనాలకు రెండేళ్ల గడువు ఉంటుంది. ఆరేళ్ల నుంచి 10 ఏళ్ల లోపు వాటికి ఏడాదికి ఒకసారి, 10 ఏళ్లు దాటిన వాటికి ప్రతి 6 నెలలకు ఒకసారి పీయూసీ పరీక్ష తప్పనిసరి. తాజా నిబంధనలతో పాత వాహనాలకు కాలపరిమితి తగ్గింది. బీఎస్1, బీఎస్2, బీఎస్3 వాహనాలకు వాటి వయసుతో, కేటగిరీతో సంబంధం లేకుండా ఇకపై కేవలం 3 నెలల గడువుతోనే పీయూసీ సర్టిఫికెట్ ఇస్తారు. గతంలో ఏడాది గడువు ఉన్న బీఎస్4 వాహనాలకు ఇకపై 6 నెలల పీరియడ్​ వర్తిస్తుంది.