ఏండ్ల నిరీక్షణకు తెర పేదల ఇంట బోసి నవ్వులు..ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు చేసినా దక్కని ఫలితం

ఏండ్ల నిరీక్షణకు తెర పేదల ఇంట బోసి నవ్వులు..ప్రైవేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు చేసినా దక్కని ఫలితం
  •     గాంధీ దవాఖానలో ఐవీఎఫ్  సక్సెస్​తో కుటుంబాల్లో ఆనందం
  •     పండంటి బిడ్డలకు  జన్మనిచ్చిన ముగ్గురు తల్లులు

పద్మారావునగర్​, వెలుగు :   కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానల చుట్టూ తిరిగి రూ. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కక నిరాశలో కూరుకుపోయిన మూడు జంటలకు గాంధీ దవాఖాన ఐవీఎఫ్ విభాగం డాక్టర్లు కొత్త  జీవితాన్ని ప్రసాదించారు. ఇటీవల ఈ మూడు జంటలకు పండంటి బిడ్డలు జన్మించడంతో ఆయా కుటుంబాల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

కారు డ్రైవర్​ కుటుంబంలో సంతోషం

వరంగల్ చెందిన కారు డ్రైవర్‌‌ రాజు, స్వరూప (35)దంపతులకు పెండ్లయి 16 ఏండ్లయినా పిల్లలు పుట్టలేదు. ప్రైవేట్ దవాఖానల్లో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అప్పు చేసి మరీ పెట్టారు. అయినప్పటికీ నిరాశే ఎదురైంది. చివరి ఆశగా సికింద్రాబాద్ గాంధీ ఐవీఎఫ్ విభాగాన్ని ఆశ్రయించారు. ఇక్కడి డాక్టర్ల ప్రత్యేక పర్యవేక్షణలో అందించిన చికిత్స విజయవంతమై స్వరూప గర్భం దాల్చింది. ఈ నెల 10న ఆమె 1.8 కిలోల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 

రైతు ఇంట విరిసిన ఆనందం..

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలానికి చెందిన అనంతయ్య (28), శనమ్మ (25) రైతులు. పెళ్లయి తొమ్మిదేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో సమాజంలో, కుటుంబంలో ఎన్నో అవమానాలతో పాటు మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ఐవీఎఫ్ చికిత్స కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆర్థికంగా చితికిపోయి చివరకు గాంధీ దవాఖానలో అందుతున్న ఉచిత ఐవీఎఫ్ సేవల గురించి తెలుసుకొని వచ్చారు. 18న ఉదయం ఎలెక్టివ్ సిజేరియన్ ద్వారా శనమ్మ 2.75 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనిచ్చారు.

పదేళ్ల కలను నెరవేర్చిన  

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ (35) సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య పీసరి మాధవి (26). ఈ దంపతులు కూడా పదేళ్లుగా సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఎన్నోచోట్ల చూపించుకున్నారు. తక్కువ ఆదాయంతో ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న టైంలో గాంధీ దవాఖాన వారికి అండగా నిలిచింది. ఇక్కడ అందించిన ఐవీఎఫ్ చికిత్స ఫలించడంతో ఈ నెల 18న ఉదయం 10:16 గంటలకు మాధవి 2.4 కిలోల బరువున్న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

డాక్టర్లకు థాంక్స్​  

ఒక చిన్న ఆశ, గొప్ప నమ్మకంతో గాంధీ దవాఖాన మెట్లెక్కిన తమకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మధురమైన ఫలితం దక్కిందని మూడు జంటలు సంతోషం వ్యక్తం చేశాయి. ప్రైవేట్  దవాఖానల్లో లక్షలు పోసినా దక్కని వరాన్ని గాంధీ దవాఖాన డాక్టర్లు ఉచితంగా అందించారని కొనియాడారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన గాంధీ దవాఖాన ఐవీఎఫ్ విభాగం డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సంతానలేమితో బాధపడుతున్న నిరుపేద దంపతులకు గాంధీ ఐవీఎఫ్ కేంద్రం వరంగా మారిందని, అర్హులైన వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్​ప్రొఫెసర్​ టి.ఉషారాణి,హెచ్​ఓడీ  డా.శోభ,ఎల్​ఆర్​ఎమ్​ఓ డా.సుథార్​ సింగ్ విజ్ఞప్తి  చేశారు.