కృష్ణా, గోదావరిలో  చుక్క నీరూ వదులుకోం..సాగర్ నుంచి 1.8 టీఎంసీలు తరలించే ఏపీ యత్నాలను అడ్డుకుంటం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కృష్ణా, గోదావరిలో  చుక్క నీరూ వదులుకోం..సాగర్ నుంచి 1.8 టీఎంసీలు తరలించే ఏపీ యత్నాలను అడ్డుకుంటం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కేంద్రం, కేఆర్‌‌‌‌ఎంబీకి ఇప్పటికే గట్టిగా అభ్యంతరాలు తెలిపాం
  • బార్డర్‌‌‌‌లో ఫైటర్ పైలట్‌‌‌‌లా.. అదే తెగువతో రాష్ట్ర నీళ్ల కోసం పోరాడుతా
  • హుజూర్‌‌‌‌నగర్ బహిరంగ సభలో మంత్రి  

హైదరాబాద్/హుజూర్ నగర్, వెలుగు: కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటినీ వదులుకోబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బుధవారం హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌‌‌‌గా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో తాను ఎలాంటి క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, పట్టుదలతో సేవలందించానో, తెలంగాణ నీటి హక్కుల రక్షణలోనూ అదే తెగువ చూపుతానని వెల్లడించారు.  

ఏపీ ఏకపక్ష చర్యలను సహించం

కృష్ణా బేసిన్‌‌‌‌లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ ప్రతిపాదనలను గట్టిగా తిప్పికొడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ)కు అభ్యంతరాలు తెలియజేశామన్నారు. రాష్ట్ర న్యాయమైన వాటాకు నష్టం కలిగించే ఏకపక్ష నిర్ణయాలను అనుమతించబోమని, కోట్ల మంది ప్రజల తాగునీటి భద్రత, వ్యవసాయం, జీవనోపాధికి నదీ జలాల పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి వినియోగాన్ని మెరుగుపరచడంతో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగాయని ఉత్తమ్ తెలిపారు. ఫలితంగా వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు .

తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తం

ఎల్​నినో పరిస్థితిల కారణంగా రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్​వెల్లడించారు. జల వనరులను సమర్థవంతంగా వినియోగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ చేయూత పెన్షన్లు అందజేయనున్నట్టు మంత్రి  చెప్పారు. అనంతరం రామస్వామి గుట్ట వద్ద మోడల్ కాలనీ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. వారం రోజుల్లో 1500 మంది లబ్ధిదారులకు మొదటి విడతలో ఇండ్లను అందజేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి  వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ నరసింహ, దివ్యాంగుల కమిషన్ చైర్మన్ ముత్తి వీరయ్య, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్, జిల్లా గ్రంథాలయం  చైర్మన్ వంగవీటి రామారావు, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.