- హోటళ్ల నుంచి టోలీచౌకి సీఐ నెలవారీ మామూళ్లు
- రూ. 50 వేలకు ఒప్పందం
- ఫస్ట్నెల రూ.10 వేలు డిస్కౌంట్
- రెండో విడత రూ.20 వేలు తీసుకుంటూ దొరికిండు
- లెక్కల్లో చూపని నగదు రూ.1.80 లక్షలు
మెహిదీపట్నం, వెలుగు: ఏసీబీకి చిక్కిన టౌలీచౌకీ సీఐ రమేశ్నాయక్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పీఎస్ పరిధిలోని ఓ హోటల్ టైమింగ్స్ విషయంలో సహకరించేందుకు నెలకు రూ.50 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు పూర్తి చేసుకోవడానికి అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత అదనంగా మరో గంట పాటు హోటల్ క్యాఫెటీరియా నడుపుకోవడానికి అనుమతి ఇచ్చేందుకు నెలకు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీనికి నెలకు రూ.50 వేలకు డీల్కుదుర్చుకుని..మొదటి నెల రూ.10 వేలు డిస్కౌంట్ఇచ్చినట్టు తెలిసింది.
అందులో భాగంగా అక్టోబర్31న రూ.20 వేలు తీసుకోగా..మిగిలిన రూ.20 వేలను గురువారం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు ఏసీబీ జరిపిన సోదాల్లో నాలుగు వేర్వేరు కవర్లు కనిపించగా..అందులో రూ.1.80 లక్షల నగదు దొరికింది. లెక్కల్లో చూపని ఈ నగదును గుర్తించి సీఐని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
