- కౌలు, కూలీతోనే బతుకుతున్న 23శాతం ఫ్యామిలీస్
- పార్లమెంటరీ కమిటీకి సంక్షేమ శాఖ నివేదిక
- కొత్తగూడెంలో లక్ష, మహబూబాబాద్‌లో 75 వేల కుటుంబాలు
- పట్టా లేక బ్యాంకు రుణాలు, స్కీముల ఫాయిదాకు దూరం
- అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాలు పంపిణీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 30.71 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో దాదాపు 7 లక్షల కుటుంబాలకు సొంత భూమి లేదని ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. అంటే దాదాపు 23 శాతం కుటుంబాలు కౌలు సాగు, కూలి పనులతోనే బతుకుతున్నాయి. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీకి సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి.
ఈ ఒక్క జిల్లాలోనే లక్ష కుటుంబాలకు సొంత భూమి లేదు. ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో 75 వేలకు పైగా కుటుంబాలకు భూమి లేదు. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ రెండు జిల్లాల్లోనే 1.75 లక్షలకు పైగా భూమి లేని కుటుంబాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో 50 వేల కుటుంబాల చొప్పున భూమి లేనివాళ్లు ఉన్నారని నివేదిక పేర్కొంది. గద్వాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, నారాయణపేట జిల్లాల్లో భూమి లేని కుటుంబాలు తక్కువగా ఉన్నాయి.
కౌలు, కూలీయే దిక్కు
సొంత భూమి లేని ఈ 7 లక్షల కుటుంబాలు ఇతరుల భూములను కౌలుకు తీసుకోవడం లేదా రోజువారీ కూలి పనులపైనే ఆధారపడుతున్నాయి. ఉపాధి హామీ (వీబీ–జీ రామ్ జీ) పనులు, వ్యవసాయ సీజన్లో కూలి, ఆఫ్ సీజన్లో ఇతర పనులతో బతుకుతున్నాయి. భూమిపై హక్కు లేకపోవడంతో కౌలు రైతులు పెట్టుబడి, కౌలు భారంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వానలు సరిగా పడక, కరువు వచ్చి దిగుబడి తగ్గినప్పుడు ఈ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పట్టా పాస్‌బుక్ లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ వ్యవసాయ పథకాల ప్రయోజనాలూ అందడం లేదు. భూమి లేని ఈ కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని సామాజిక, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
అటవీ హక్కుల కింద సాగు భూమి
భూమి లేని ఎస్టీ కుటుంబాలకు గిరిజన శాఖ ప్రభుత్వ భూములను సాగుకు ఇస్తోంది. అటవీ హక్కుల చట్టం–2006 కింద ఇప్పటిదాకా 2,30,735 టైటిల్ డీడ్స్ ద్వారా 6,69,676 ఎకరాలు పంపిణీ చేసినట్లు కమిటీకి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు.
జనాభాలో 28 శాతం ఎస్సీ, ఎస్టీలే
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సీపెక్) గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభాలో ఎస్సీ, ఎస్టీల వాటా 27.85 శాతం. ఈ సర్వే డేటాను విశ్లేషించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం ‘కాంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్’ ప్రకారం ఓసీలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీలు సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మూడు రెట్లు వెనుకబడి ఉన్నారని తేల్చింది. ఇండ్లు, టాయిలెట్ల వంటి కనీస సౌకర్యాల్లోనూ ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయి. ఈ డేటా ఆధారంగా ఉపకులాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తెస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
సీపెక్ సర్వే లెక్కలు
వర్గం జనాభా జనాభా శాతం కుటుంబాలు కుటుంబాల%
ఎస్సీ 61,91,294 17.42 19,49,800 17.35
ఎస్టీ 37,08,408 10.43 11,21,212 9.98
