- జాబ్ పోతే రెండు నెలల్లో ఫుల్ సెటిల్‌మెంట్
- రిటైరైతే విడతలుగా విత్‌డ్రా
- రెండున్నర రోజుల్లోనే క్లెయిమ్ పరిష్కారం
- పెన్షన్ పెంపుపై నో క్లారిటీ
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నుంచి మరింత సులువుగా డబ్బు తీసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) రూల్స్‌ను సడలించింది. 55 ఏళ్లలోపు సభ్యులు పీఎఫ్ ఖాతాలో కనీసం 10 శాతం నిల్వ ఉంచితే చాలు. గతంలో ఇది 25 శాతం ఉండేది. ఇక నుంచి అవసరమైనప్పుడు తమ పీఎఫ్ డబ్బులో 90 శాతం వరకు తీసుకోవచ్చు. శాశ్వత వైకల్యం, ఉద్యోగం చేయలేని పరిస్థితి, ఉద్యోగం తొలగింపు, వీఆర్ఎస్ వంటి సందర్భాల్లో మొత్తం పీఎఫ్ డబ్బును తీసుకోవచ్చు.
ఉద్యోగం పోతే మొత్తం డబ్బు తీసుకునేందుకు ఏడాది ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సమయాన్ని తగ్గించారు. గతంలో ఉద్యోగం పోయిన వెంటనే పీఎఫ్‌లోని 75 శాతం తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతం ఏడాది తర్వాత తీసుకునే వీలుండేది. ఇప్పుడు రెండు నెలలు ఆగితే చాలు. తాజా మార్పుతో ఉద్యోగులు తమ అవసరాలకు తగినట్లు డబ్బును త్వరగా పొందవచ్చు. అయితే ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్) కింద పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అధిక పెన్షన్ దరఖాస్తులన్నింటినీ ఆమోదించే అంశంపైనా ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు స్పష్టత ఇవ్వలేదు.
విడతలుగానూ తీసుకోవచ్చు
పీఎఫ్ డబ్బును ఒకేసారి తీసుకోకుండా, కొంత మొత్తాన్ని క్రమంగా పొందేలా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను కూడా ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత పీఎఫ్ పొదుపును విడతలుగా తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు ఖాతాలోనే ఉండటంతో భవిష్యత్తులోనూ దానిపై వచ్చే ఆదాయం కొనసాగుతుంది. గతంలో ఈ సదుపాయం ఎన్పీఎస్ సభ్యులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఈపీఎఫ్ సభ్యులకూ అందుబాటులోకి తీసుకురానున్నారు. సభ్యుడు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని నామినీ లేదా వారసులకు అందించే విధానంపై వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈడీఎల్ఐ స్కీమ్‌లో మార్పులు
పెండింగ్ మినహాయింపు కేసుల పరిష్కారానికి ఈడీఎల్ఐ స్కీమ్ 2026 సవరణలకు ఈపీఎఫ్ఓ బోర్డు ఆమోదం తెలిపింది. 31 సంస్థల నుంచి రూ.5,996 కోట్ల నిధులను, 1,44,437 మంది ఖాతాలను ఈపీఎఫ్ఓ పరిధిలోకి తెచ్చారు. కొత్త డిజిటల్ వ్యవస్థ (సైట్స్2.0) వల్ల ఆటో క్లెయిమ్స్ 71 శాతానికి పెరిగి, పరిష్కార సమయం 2.57 రోజులకు తగ్గింది. ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల్లో 3 శాతం పెట్టుబడులకు, 2027-28 బడ్జెట్ అంచనాలకు ఆమోదం లభించింది.
