- ఈఈ అలర్ట్ చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం
- విధుల్లో నిర్లక్ష్యం.. తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ జలాశయంలో ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా చేపడుతున్న సొరంగం, పైప్లైన్ పనుల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పొరుగు రాష్ట్రం ప్రాజెక్టు పక్కనే భారీ నిర్మాణాలు చేపడుతున్నా ప్రభుత్వానికి సకాలంలో సమాచారం అందించకుండా, విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారంటూ నాగార్జునసాగర్ సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ)పై సస్పెన్షన్ వేటు వేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది. సాగర్ సొరంగం పనులపై కావాలనే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. క్షేత్రస్థాయి నుంచి ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) అలర్ట్ చేసినప్పటికీ పైస్థాయిలో స్పందించకుండా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రభుత్వం ఎస్ఈపై మండిపడింది.
ఈఈ అలర్ట్ చేసినా..
నాగార్జునసాగర్ డ్యామ్ కుడివైపున, విజయపురి సౌత్ ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం గత 8 నుంచి 9 నెలలుగా నిరంతరాయంగా నిర్మాణ పనులు కొనసాగిస్తోంది. తెలంగాణ సరిహద్దుకు కూతవేటు దూరంలోనే రేయింబవళ్లు పనులు జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి సకాలంలో నివేదిక అందకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లోతుగా ఆరా తీయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ చేపడుతున్న టన్నెల్, ఇన్టేక్ వెల్స్ పనులను గమనించిన సంబంధిత ఈఈ.. ఆ వివరాలను ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లి అలర్ట్ చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ ఎస్ఈ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోగా, ప్రభుత్వానికి గానీ, ఉన్నతాధికారులకు గానీ కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కావాలనే దాచిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల భద్రత, అంతర్రాష్ట్ర జల వివాదాల వంటి సున్నితమైన అంశంలో విధుల్లో ఘోరంగా నిర్లక్ష్యం వహించారని సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
షోకాజ్ ఇచ్చి..
సాగర్ సొరంగం వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా, పరిపాలనాపరంగా పెను దుమారం రేపడంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. తొలుత సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ, ఈఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సర్కార్, ఇంతకాలంగా పనులు జరుగుతున్నా ప్రభుత్వాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు పనులు జరుగుతున్నా తమకు ఎలాంటి సమాచారం లేదని గతంలో డ్యామ్ ఎస్ఈ వ్యాఖ్యానించడం క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపింది.
ఉన్నతాధికారుల షో కాజ్ నోటీస్ కు స్పందించిన ఈఈ.. తాను ముందే ఎస్ఈకి సమాచారం ఇచ్చానని, ఇది చిన్న విషయమేనని, ఎవరికీ చెప్పొద్దంటూ తన నోరు మూయించారని వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ఎస్ఈ నుంచి సరైన వివరణ రాలేదని తెలిసింది. ఆయనకు ఏపీ మూలాలు కూడా ఉండడంతో.. కావాలనే ఎస్ఈ ఆ ప్రాజెక్ట్ విషయం దాచి పెట్టారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చెయ్యాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
