- స్టాక్ మార్కెట్‌లోకి ఆంత్రోపిక్ గ్రాండ్ ఎంట్రీ..
- 34 శాతం ప్రీమియంతో 11.50 డాలర్ల వద్ద నాస్‌డాక్‌లో లిస్టింగ్
- 2 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ వాల్యుయేషన్
న్యూయార్క్: అమెరికా ఏఐ కంపెనీ ఆంత్రోపిక్ స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలిరోజే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించి, కంపెనీ ఫౌండర్లను సంపన్నులను చేసింది. నాస్‌డాక్‌లో గురువారం 'ఏఎన్‌టీ' సింబల్‌తో ఈ కంపెనీ లిస్ట్ అయ్యింది. కంపెనీ ఐపీఓ ధర 83 డాలర్లతో పోలిస్తే ఏకంగా 34 శాతం ప్రీమియంతో 111.50 డాలర్ల (రూ.10,370) వద్ద మార్కెట్‌లో అడుగుపెట్టింది.
రికార్డుల మోత
ఆంత్రోపిక్ ఐపీఓ (81.3 బిలియన్ డాలర్లు), ప్రైవేట్ ప్లేస్‌మెంట్ (26 బిలియన్ డాలర్లు) ద్వారా మొత్తం 107.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.10 లక్షల కోట్ల)ను సమీకరించి, స్పేస్‌ఎక్స్ పేరిట ఉన్న ప్రపంచ అతిపెద్ద ఐపీఓ రికార్డును అధిగమించింది.
ఐపీఓలో 83 డాలర్ల వద్ద 1.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ , 111.50 డాలర్ల లిస్టింగ్ ప్రైస్ దగ్గర 2 ట్రిలియన్ డాలర్ల (రూ. 186 లక్షల కోట్ల) కు ఎగబాకింది. అతిపెద్ద విలువతో లిస్ట్ అయిన టెక్ సంస్థగా రికార్డ్ సృష్టించింది.
ప్రత్యర్థి ఓపెన్‌ఏఐ కంటే ముందే పబ్లిక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి, లిస్ట్ అయిన తొలి అగ్రశ్రేణి ఏఐ ల్యాబ్‌గా ఆంత్రోపిక్ నిలిచింది. ఈ భారీ లిస్టింగ్‌తో ఆంత్రోపిక్ ఏడుగురు ఫౌండర్ల ఒక్కొక్కరి వాటాల విలువ 22 బిలియన్ డాలర్లు దాటింది.
చైనా మోడళ్లతో సవాళ్లు
క్లాడ్ కోడ్, కార్పొరేట్ క్లయింట్ల ఆదరణతో ఆంత్రోపిక్ ఏడాది రెవెన్యూ 81 బిలియన్ డాలర్లకు చేరింది. 2030 నాటికి ఇది 685 బిలియన్ డాలర్లకు చేరవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అయితే, చిప్స్, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కోసం ఉన్న 901 బిలియన్ డాలర్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడం, చైనా తక్కువ ధర ఏఐ మోడళ్ల పోటీ నడుమ లాభదాయకతను నిలబెట్టుకోవడం ఆంత్రోపిక్‌కు కీలక సవాలుగా నిలవనుంది.
