- ఏపీకి 63శాతం నీళ్లంటూ సంతకాలు పెట్టింది మామా అల్లుళ్లే
- జగన్‌ను పిలిచి రాయలసీమ లిఫ్ట్‌కు దారి చూపింది కేసీఆరే
- పోతిరెడ్డిపాడు పొక్క పెంచినప్పుడు మంత్రిగా ఉన్నది హరీశే
- ఇవన్నీ అసెంబ్లీలో చర్చిద్దాం.. దమ్ముంటే రావాలని సవాల్
- రూ.38 వేల కోట్ల ప్రాణహితను లక్షన్నర కోట్లకు పెంచి కూల్చిన్రు
- నేను తెలంగాణ బిడ్డను.. నా నేలకు అన్యాయం చేస్తనా: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో తెలంగాణకు మరణ శాసనం రాసిందే కేసీఆర్, హరీశ్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అప్పుడు మామా అల్లుళ్లిద్దరూ ఏపీకి 63 శాతం నీళ్లకు సంతకాలు పెట్టి వచ్చి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లు వదులుతున్నాడని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘నేను తెలంగాణ బిడ్డను. ఈ మట్టిలో పుట్టిన, ఈ మట్టిలో పెరిగిన, ఈ మట్టిలోనే కలుస్తా. నా జాతికి, గడ్డకు, నేలకు నేను అన్యాయం చేస్తనా?’ అని ప్రశ్నించారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి, చంద్రబాబు, కేసీఆర్, హరీశ్ కలిసి కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు పెట్టి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం రైతులకు మరణ శాసనం రాశారని, 2022లో దాన్ని శాశ్వతం చేశారని, ఇందుకు అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
రాయలసీమ లిఫ్ట్‌కు దారి చూపింది కేసీఆరే
ప్రగతి భవన్‌కు జగన్మోహన్ రెడ్డిని పిలిచి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి, రాయలసీమలో రోజమ్మ ఇంట్లో రొయ్యల పులుసు తిని, రాయలసీమ లిఫ్ట్‌కు, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు అనుమతిచ్చింది కేసీఆర్ కాదా అని సీఎం నిలదీశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డిపాడు పొక్కను పెంచి రోజుకు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోయే నిర్ణయం తీసుకున్నప్పుడు హరీశ్ రావు మంత్రిగా ఉన్నారని, నాయిని నర్సింహారెడ్డి కడప జిల్లా ఇన్చార్జిగా ఉన్నారని గుర్తుచేశారు. ఇవాళ పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిపోతుంటే ఆ పాపం ముమ్మాటికీ తండ్రి, కొడుకు, అల్లుడిదేనని మండిపడ్డారు. నాడు తెలంగాణకు అన్యాయం చేసిన వీళ్లను చింత బరిగె తీసుకుని చింత మడుకల కోదండం వేసి కొట్టాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టుల క్వాలిటీలో రాజీపడింది హరీశ్ రావేనని ఆరోపించారు.
ప్రాణహితను కాళేశ్వరం చేసి కూల్చిన్రు
గోదావరి జలాల విషయంలోనూ కేసీఆర్, హరీశ్ రాష్ట్రాన్ని నిండా ముంచారని సీఎం విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి సహా 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటి కోసం తుమ్మిడిహెట్టి దగ్గర రూ.38 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ మొదలుపెట్టి రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక పేరును కాళేశ్వరంగా మార్చి, మంథనికి తరలించి, అంచనాలను రూ.1.50 లక్షల కోట్లకు పెంచి, రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కట్టారని అన్నారు. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకు నాసిరకం డిజైన్లతో కట్టడంతో 2019లో కట్టిన బ్యారేజీ కొన్నేండ్లకే కుంగిపోయిందని ఆరోపించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులను పదేండ్లు పడావు పెట్టారని మండిపడ్డారు.
‘నా నేలకు ద్రోహం చేస్తే తెలంగాణ బిడ్డనే కాదు’
నాలుగు కోట్ల ప్రజలు చిన్న వయసులోనే గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించి, లక్షలాది కార్యకర్తలు భుజాలపై మోసి అధికారం ఇస్తే ఈ నేలకు ద్రోహం చేస్తానా అని సీఎం ప్రశ్నించారు. అలాంటి ఆలోచన తన మదిలో వస్తే తాను తెలంగాణ తల్లి బిడ్డనే కాదన్నారు. ఏపీలో, కేంద్రంలో అధికారం ఉన్నా తెలంగాణ హక్కుల కోసం 2017లోనే చంద్రబాబుతో సంబంధాలు తెంచుకుని, ‘మీతో కలిసి నడవలేను’ అని నమస్కారం పెట్టి బయటికొచ్చానని గుర్తుచేశారు. అలాంటి తనపై నిందలు వేయడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు.
