- పదేండ్ల పాటు కృష్ణా బేసిన్ను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ధర్నాలా అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల పాటు కృష్ణా బేసిన్ను నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్తో రాజీ పడే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం పోరాడతామని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి అక్రమంగా నీరు తరలివెళ్లకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
గతంలో ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి వచ్చేలా నిర్మించి ఉంటే తాము ఆ నీటిని ఉపయోగించుకునేవారమని ఆయన అన్నారు. ప్రాజెక్టును బాంబులతో పేల్చారన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రాజెక్టు చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయని, ఆధారాలు ఉంటే తమపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ హయాంలోనే ఆ ప్రాజెక్టు దెబ్బతిన్న విషయం ప్రజలకు తెలుసని, ఇకనైనా డ్రామాలు ఆడటం మానుకోవాలని సూచించారు. జవహర్లాల్ నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ ఆధునిక దేవాలయాలుగా నిలిచి ప్రజలకు సేవలందిస్తున్నాయని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
గాంధీ భవన్లో ఘనంగా ఇందిరా జయంతి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లడారు. ఆమె ఆశయాల మేరకు రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తూ పేదల సొంతింటి కలను రేవంత్ సర్కార్ సాకారం చేస్తుందన్నారు. ఇందిరా కోడలు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకాన్ని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చదవాలని, అందులోని విషయాలతో ఇందిరా జీవితం దేశం కోసం చేసిన త్యాగం, సేవలను తెలుసుకోవాలని మహేశ్ గౌడ్ కార్యకర్తలను కోరారు.
